నార్కోటిక్ డాగ్‌తో భూపాలపల్లిలో సీసీఎస్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు
భూపాలపల్లి జిల్లాలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు తనిఖీలను తీవ్రతరం చేశారు.భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం సీసీఎస్ పోలీసులు నార్కోటిక్ డాగ్ (స్నిఫర్ డాగ్) సహాయంతో పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్, కాకతీయ కాలనీ, జంగేడు, ఖాసింపల్లి ప్రాంతాల్లో గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు, వినియోగదారుల ఇళ్లు మరియు వారి పరిసర ప్రాంతాల్లో ఈ కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా గంజాయి కేసుల్లో ఉన్న పాత నేరస్థులు, వినియోగదారులు, వారి కుటుంబ సభ్యులతో పోలీసులు నేరుగా మాట్లాడారు. గంజాయి విక్రయం, రవాణా, నిల్వ లేదా వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాలో మాదకద్రవ్యాలు సేవించే వారిపై, విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, భవిష్యత్తులో ఎవరైనా గంజాయి సంబంధిత నేరాల్లో పాల్గొన్నట్లు తేలితే వారిపై చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు.మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు, నిఘా చర్యలతో పాటు అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించి గంజాయి విక్రయం,రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా జిల్లా పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని సీసీఎస్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.