స్వీయ సంరక్షణతోనే సంపూర్ణ ఆరోగ్యం
ఛాతీ నొప్పి, స్ట్రోక్ నివారణకు జీవనశైలిలో మార్పులు అవసరం”
స్వీయ సంరక్షణ దినోత్సవం సందర్భంగా 108 ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ కార్యనిర్వాహణ అధికారి బి. సుధాకర్ పిలుపు వైద్యులు, ఆసుపత్రులపై మాత్రమే ఆధారపడకుండా ప్రతి వ్యక్తి తన ఆరోగ్యాన్ని తానే సంరక్షించుకోవడం అత్యంత అవసరమని 108 ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహణ అధికారి బి. సుధాకర్ అన్నారు. జూలై 24న నిర్వహించే అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ప్రకటనలో స్వీయ సంరక్షణ అలవాట్లు ఆరోగ్య రక్షణకు బలమైన ఆయుధమని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం జూలై 24న నిర్వహించే స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని 2011లో అంతర్జాతీయ స్వీయ సంరక్షణ ఫౌండేషన్ ప్రారంభించిందని, రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలనే సందేశంతో ఈ తేదీని ఎంపిక చేసినట్లు తెలిపారు.
108 ఈఎంఆర్ఐ అత్యవసర సేవల గణాంకాల ప్రకారం 2026 జనవరి నుంచి జూన్ వరకు తెలంగాణలో 17,940 ఛాతీ నొప్పి అత్యవసర కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల వయస్సు వారిలోనే కాకుండా యువతలోనూ గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడంతో పాటు సమతుల్య ఆహారం, రోజువారీ వ్యాయామం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
సామాన్య ప్రజల కోసం “హార్ట్” ఐదు దశల స్వీయ సంరక్షణ ప్రణాళికను కూడా వివరించారు. ప్రతి భోజనంలో ఒక పండు, ఒక కూరగాయ తీసుకోవడం, రాత్రి భోజనం అనంతరం 30 నిమిషాలు నడవడం, పొగాకు, మద్యానికి పూర్తిగా దూరంగా ఉండడం, ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తపోటు పరీక్ష చేయించుకోవడం, నిద్రకు ముందు 10 నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు.
గత ఏడు సంవత్సరాల్లో దేశంలో గుండెజబ్బుల బాధితుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగిందని, 15 నుంచి 29 ఏళ్ల యువత కూడా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు జాతీయ గణాంక సంస్థ తాజా సర్వే వెల్లడించిందన్నారు.
గత ఆరు నెలల్లో తెలంగాణలో 5,025 స్ట్రోక్ అత్యవసర కేసులు నమోదయ్యాయని 108 ఈఎంఆర్ఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలే స్ట్రోక్‌కు ప్రధాన కారణాలని, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా వీటిని గణనీయంగా నివారించవచ్చని సూచించారు.
స్వీయ సంరక్షణ వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని, పోషకాహారం, తగిన నిద్ర, వ్యాయామం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే యోగా, ధ్యానం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, డిజిటల్ పరికరాలకు కొంత సమయం దూరంగా ఉండడం వంటి అలవాట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 108 అంబులెన్స్ సేవలకు ఫోన్ చేయడం కూడా స్వీయ సంరక్షణలో అత్యంత కీలకమైన చర్య అని బి. సుధాకర్ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు 108 అత్యవసర సేవలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ పొందిన సిబ్బందితో నిరంతరం సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.