
- మిర్చి తోటలో పనికి వెళ్లి కరెంట్ షాక్‌కు బలి.. పేరూరు గ్రామంలో విషాదం
- మల్చింగ్ షీట్ పరుస్తుండగా ప్రమాదం.. ఘటనపై పోలీసుల దర్యాప్తు
E69NEWS – తెలుగు గళం వాజేడు, సెప్టెంబర్ 11

ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామంలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మిర్చి పంటలో మల్చింగ్ షీట్ పరిచే కూలి పనులకు వెళ్లిన అదే గ్రామానికి చెందిన పంది సమ్మయ్య (50), తుమ్మ అభిషేక్ (28) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. సమాచారం ప్రకారం.. రైతు పొలంలో ఏర్పాటు చేసిన ఐరన్ ఫెన్సింగ్ ముళ్ల తీగకు విద్యుత్ సరఫరా కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విద్యుత్ మోటార్‌కు సంబంధించిన సర్వీస్ వైరు పొడవుగా ఉండటంతో దానిని రింగులుగా చుట్టి ముళ్ల కంచెకు సమీపంలో ఉంచినట్లు సమాచారం. ఎలుకలు వైర్లను కొరకడంతో ఇన్సులేషన్ దెబ్బతిని విద్యుత్ ప్రవాహం ముళ్ల తీగకు చేరినట్లు తెలుస్తోంది. మల్చింగ్ షీట్ పరుస్తూ పొలం చివరి భాగానికి వెళ్లిన సమ్మయ్య, అభిషేక్ ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహిస్తున్న ముళ్ల తీగను తాకడంతో ఒక్కసారిగా షాక్‌కు గురై కిందపడిపోయారు. వెంటనే తోటి కూలీలు వారిని రక్షించి హుటాహుటిన పేరూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. రోజువారీ కూలి పనుల కోసం వెళ్లిన ఇద్దరు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. పొలాల్లో విద్యుత్ వైర్లు, ఫెన్సింగ్‌ల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా రైతులు, విద్యుత్ అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై పేరూరు పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
