
16 ఏళ్లలోపు వారికి UKలో సోషల్ మీడియా నిషేధం
జలీస్ అహ్మద్
17 జూన్ 2026
ఒక్క క్షణం ఊహించండి. ఒక వ్యక్తి లోతైన ఆలోచనలో మునిగిపోయి, జీవితానికి అర్థం ఏమిటో అన్వేషిస్తూ, తన గతాన్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. దాదాపు ఒక గంట పాటు అతను జీవితంలోని అనేక ప్రశ్నలతో పోరాడుతున్నాడు. ఇంతలో, సూది పడిన శబ్దం కూడా వినిపించేంత నిశ్శబ్దంలో, తన ఫోన్ 100 శాతం ఛార్జ్ అయిందని అతను గమనిస్తాడు.
భవిష్యత్తు కొంతసేపు వేచి ఉండవచ్చు; కానీ స్క్రోలింగ్ మాత్రం వేచి ఉండదు!
ఇది ఒక హాస్యాస్పదమైన ఉదాహరణలా అనిపించవచ్చు. కానీ మనం నివసిస్తున్న ప్రపంచం యొక్క వాస్తవ పరిస్థితి ఇదే. నేడు మన జీవితంలోని దాదాపు ప్రతి క్షణాన్ని స్క్రీన్లు ప్రభావితం చేస్తున్నాయి. వాతావరణ పరిస్థితిని తెలుసుకోవడానికి ఫోన్ తీసుకున్నా, మన దృష్టిని ఆకర్షించడానికి ఒకదానితో ఒకటి పోటీపడుతున్న నోటిఫికేషన్లు, కంటెంట్ల ప్రవాహంలోకి మనం లాగబడుతున్నాము.
ఒకప్పుడు స్పష్టమైన ఉద్దేశంతో చేసే పనులు, ఇప్పుడు మన దృష్టిని మరల్చే అవకాశాలుగా మారిపోయాయి. సౌకర్యం కోసం మనం ఆధారపడే పరికరాలు, మన దృష్టిని ఆకర్షించి, దానిని మన వద్దే నిలుపుకునే విధంగా రూపొందించబడ్డాయి.
అందువల్ల, ఈ క్షణంలో పూర్తిగా ఉండటం లేదా కొంతసేపైనా ఏదైనా ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఉండటం గతంలో కంటే కష్టమైపోయింది.
UK మరియు 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం
ఈ నేపథ్యంలో, UK చివరకు ఒక చర్య తీసుకుంటోంది. ఇలాంటి చర్యను మొదటగా ప్రవేశపెట్టిన దేశం ఆస్ట్రేలియా. ఇప్పుడు UK కూడా అదే మార్గాన్ని అనుసరిస్తోంది.
16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించకుండా త్వరలో నిషేధం విధించనుంది UK ప్రభుత్వం.
WhatsApp, Signal వంటి మెసేజింగ్ సేవలు ఈ నిషేధంలోకి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. ఎందుకంటే అవి సాధారణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కంటే కమ్యూనికేషన్ సాధనాలుగా పరిగణించబడుతున్నాయి.
ఈ మార్పులు 2027 వసంతకాలం నాటికి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
UK ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“మనం పిల్లలకు వారి బాల్యాన్ని తిరిగి ఇస్తున్నాము. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు సేవలు అందించకుండా అడ్డుకుంటాము. భవిష్యత్ తరాల కోసం ఒక కొత్త సాధారణ పరిస్థితిని సృష్టిస్తూ, పిల్లలకు ఏది ఉత్తమమో చేయాలనుకునే తల్లిదండ్రులను శక్తివంతం చేస్తున్నాము.”
ఈ విధానంతో ఎవరైనా ఏకీభవించినా, ఏకీభవించకపోయినా, యువత మరియు సోషల్ మీడియా మధ్య సంబంధాన్ని ప్రభుత్వాలు ఎలా చూస్తున్నాయనే విషయంలో ఇది ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తోంది.
మనం సృష్టించుకున్న సమస్య
ఈ అల్గారిథమ్ ప్రపంచానికి మనం ఎలా చేరుకున్నాం?
ఈ వార్త విన్నప్పుడు నా మనస్సులో మొదట వచ్చిన ప్రశ్న:
UK ఇక్కడికి ఎలా చేరుకుంది?
లేదా మరింత సరిగ్గా అడిగితే:
ప్రపంచం ఇక్కడికి ఎలా చేరుకుంది?
సోషల్ మీడియా ఒక రకమైన వ్యసనాన్ని సృష్టించగలదనేది రహస్యం కాదు. ఇది పిల్లలకు మాత్రమే కాదు; పెద్దలకు కూడా వర్తిస్తుంది.
2018లోనే BBC నివేదించిన ప్రకారం, సోషల్ మీడియా కంపెనీలు ఆర్థిక ప్రయోజనం కోసం వినియోగదారులను తమ ఉత్పత్తులతో ఉద్దేశపూర్వకంగా మరింతగా అనుసంధానించే విధంగా వ్యవహరిస్తున్నాయి.
దీని గురించి ఆలోచిస్తే, నిరంతరం మన దృష్టిని కోరుకునే ఏదైనా విషయం సహజంగానే మనలను మరింత ముఖ్యమైన విషయాల నుంచి దూరం చేస్తుంది.
మీ రోజువారీ బాధ్యతలను పూర్తి చేయలేకపోతున్నారని ఊహించండి—ఎందుకంటే మీ రోజులో 3–4 గంటలు స్క్రీన్ ముందు గడిచిపోయాయి.
కాబట్టి అసలు ప్రశ్న:
ఈ నిషేధం మంచిదా? చెడ్డదా?
అది కాదు.
అసలు ప్రశ్న: మనం ఇక్కడికి ఎలా చేరుకున్నాం?
సోషల్ మీడియా ఎంత వ్యసనపరచగలదో మనకు తెలిసినప్పటికీ, మనం ఈ మార్గంలో ముందుకు సాగుతూనే ఉన్నాము.
నేటి పిల్లలు ఆటస్థలానికి వెళ్లడం కంటే స్క్రీన్‌ను ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రపంచాన్ని ప్రత్యక్షంగా అన్వేషించడం కంటే స్క్రోలింగ్ చేయడం వారికి సులభంగా మారింది.
స్క్రీన్ల ప్రభావం మనస్సుతో మాత్రమే పరిమితం కాదు. అది శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంతకంటే ముఖ్యంగా, బాల్యాన్ని అనుభవించే విధానాన్ని కూడా మార్చేస్తుంది.
మీ యౌవనంలో ప్రతిరోజూ 3–4 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడిపి, 30 ఏళ్ల వయస్సుకు చేరుకున్నప్పుడు, సోషల్ మీడియాలో గడిపిన ఆ సంవత్సరాల కోసం మీరు నిజ జీవిత అనుభవాలను కోల్పోయారని గ్రహిస్తే ఎలా ఉంటుంది?
మీరు లెక్కలేనన్ని సూర్యాస్తమయాల వీడియోలు చూసి ఉండవచ్చు. కానీ మీరు స్వయంగా ఎన్ని సార్లు నిశ్శబ్దంగా ఒక సూర్యాస్తమయాన్ని చూసి ఉంటారు?
మీరు ఎప్పుడూ చేపలు పట్టడానికి వెళ్లకపోవచ్చు. చెట్టు ఎక్కకపోవచ్చు. ఒక చిన్న వాగు ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవడానికి దానిని అనుసరించకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్ తొక్కకపోవచ్చు. అందమైన దృశ్యాన్ని చూడటానికి కొండ ఎక్కకపోవచ్చు. నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద గుడారం వేసుకుని రాత్రి గడపకపోవచ్చు.
అవును, సోషల్ మీడియా ప్రపంచానికి ఒక కిటికీ వంటిది. కానీ చాలామందికి అది క్రమంగా నిజమైన ప్రపంచంలో జీవించే అనుభవానికి ప్రత్యామ్నాయంగా మారిపోయింది.
తల్లిదండ్రులదే బాధ్యతా?
పిల్లలకు స్క్రీన్లు లేకుండా ఏమి చేయాలో కూడా తెలియనప్పుడు
BBC ప్రచురించిన ఒక వీడియోలో ఒక రిపోర్టర్ ఒక పాఠశాల విద్యార్థినిని వారాంతంలో ఎంత సమయం స్క్రీన్ ముందు గడిపిందని అడిగాడు.
ఆమె సమాధానం:
9 గంటలు.
సోషల్ మీడియా నిషేధం గురించి ప్రస్తావిస్తూ, ఇకపై తనకు చాలా ఖాళీ సమయం లభిస్తుందని, ఆ సమయాన్ని ఎలా గడపాలనుకుంటుందని రిపోర్టర్ అడిగాడు.
ఆమె సమాధానం చాలా సరళంగా ఉంది:
,”ఒక గోడను చూస్తూ కూర్చుంటాను.”
మనలో చాలామందికి, ముఖ్యంగా యువతకు, ఖాళీ సమయాన్ని నింపడానికి స్క్రీన్లు ప్రధాన సాధనాలుగా మారాయి.
స్క్రీన్లు లేకుండా విశ్రాంతి తీసుకోవడం కూడా ఒకరకంగా వింతగా, ఖాళీగా అనిపిస్తోంది.
నిరంతరం స్క్రీన్ ఉపయోగించడానికి చెల్లించాల్సిన మూల్యం మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. ఇది పరికరాలపై గడిపే సమయాన్ని మాత్రమే ప్రభావితం చేయదు; వాటికి దూరంగా ఉన్న సమయాన్ని ఆస్వాదించే మన సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
తరువాతి తరాన్ని పెంచుతున్న తల్లిదండ్రులుగా, ఉద్దేశపూర్వకంగా మరియు జాగ్రత్తగా పిల్లలను పెంచడం ఎంత ముఖ్యమో మనం తరచుగా తక్కువగా అంచనా వేస్తున్నాము.
ఇస్లాం మరియు పిల్లల రక్షణ
పిల్లలు ఎదుగుతున్న సమాజంలో మంచి విధంగా జీవించగలిగే వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దడంతో పాటు, మంచి స్వభావం మరియు ఉన్నతమైన విలువలను వారిలో పెంపొందించాలని ఇస్లాం మనకు బోధిస్తుంది.
వారు తమ జీవితాల్లోనూ, తమ చుట్టూ ఉన్నవారి జీవితాల్లోనూ మంచి ప్రభావాన్ని చూపగలగడం లక్ష్యం.
ప్రార్థన స్వీకరించబడటం గురించి వివరించేటప్పుడు, హజ్రత్ మసీహ్ మౌఊద్, హజ్రత్ మిర్జా గులామ్ అహ్మద్ అలైహిస్సలాం ఎంతో అందమైన ఉదాహరణను ఇచ్చారు. ఈ సందర్భంలో కూడా ఆయన మాటల నుంచి మనం ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవచ్చు.
ఆయన ఇలా అన్నారు:
“ఒక తల్లి తన బిడ్డను ఎంతగా ప్రేమిస్తుందో మనం చూస్తాము. తన బిడ్డకు ఎలాంటి హాని కలగకూడదని ఆమె కోరుకుంటుంది. అయితే ఒక చిన్నారి ఏడుస్తూ, తనకు ఒక పదునైన కత్తి లేదా మండుతున్న నిప్పు కావాలని పట్టుబడితే, నిజమైన ప్రేమ మరియు కరుణ కలిగిన తల్లి ఆ బిడ్డ తన చేతిని మండించుకోవడానికి లేదా పదునైన కత్తితో చేతిని కోసుకోవడానికి అనుమతిస్తుందా? నిశ్చయంగా కాదు.”
— మల్ఫూజాత్, ఇంగ్లీష్, సంపుటి 1, పేజీ 102
సోషల్ మీడియా వల్ల కలిగే ప్రమాదాలను, అది యువతపై చూపే ప్రభావాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత, పెరుగుతున్న వారి మనస్సులపై దాని ప్రభావం ఏమిటో తెలిసి కూడా ఒక తల్లిదండ్రి తన పిల్లల చేతిలో టాబ్లెట్‌ను ఉద్దేశపూర్వకంగా పెట్టగలరా?
మెదడులోని రివార్డ్ వ్యవస్థపై ప్రభావం చూపడం కావచ్చు, దృష్టి మరియు ఏకాగ్రతను తీర్చిదిద్దడం కావచ్చు, జీవనశైలి మరియు అలవాట్లపై ప్రభావం చూపడం కావచ్చు—ప్రమాదాలను విస్మరించడం రోజురోజుకూ కష్టమవుతోంది.
శారీరక హాని నుంచి పిల్లలను రక్షించడం మన బాధ్యత అయితే, వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే విషయాల్లో కూడా అదే జాగ్రత్త చూపించకూడదా?
కుటుంబాన్ని హాని నుంచి రక్షించడం
సోషల్ మీడియాకు ప్రయోజనాలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు. అది ప్రపంచంతో మనలను అనుసంధానిస్తుంది. ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి సోషల్ మీడియా పూర్తిగా ప్రతికూలమైనది కాదు.
అయితే దాని వినియోగంలో, ముఖ్యంగా పిల్లల విషయంలో, మరింత సమతుల్యమైన మరియు పర్యవేక్షణతో కూడిన విధానం అవసరం.
ఇస్లాంలో హానిని నివారించడాన్ని ప్రయోజనం పొందడం కంటే ప్రాధాన్యంగా చూడాలి అనే సూత్రం స్పష్టంగా ఉంది.
పరిమితులు లేకుండా, పర్యవేక్షణ లేకుండా సోషల్ మీడియాకు పూర్తి ప్రాప్తి ఉండటం వల్ల పిల్లలు బెదిరింపులు, దోపిడీ, వ్యసనపూరిత వినియోగం, అనుచితమైన కంటెంట్, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటే, సమంజసమైన నియంత్రణలను రక్షణ చర్యగా పరిగణించవచ్చు.
పవిత్ర ఖుర్ఆన్ మనలను మనతో పాటు మన కుటుంబాలను కూడా హాని నుంచి రక్షించుకోవాలని బోధిస్తుంది.
అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:
“ ఓ విశ్వసించిన వారలారా! మిమ్మల్ని మరియు మీ కుటుంబాలను అగ్ని నుండి రక్షించుకోండి.”
— పవిత్ర ఖుర్ఆన్, 66:7
తమను తాము, తమ కుటుంబాలను తప్పుదారి పట్టించే ప్రతి చెడు ప్రభావం నుంచి రక్షించుకోవడం తల్లిదండ్రుల బాధ్యత అనే విషయం ఇందులో ఉంది.
అధికంగా మరియు పర్యవేక్షణ లేకుండా సోషల్ మీడియాను ఉపయోగించడం పిల్లల సంక్షేమాన్ని, మెదడు అభివృద్ధిని ప్రభావితం చేయగలదని మనకు తెలుసు.
మాటలను, చూపును, సమయాన్ని, హృదయాన్ని కాపాడుకోవడానికి ఇస్లాం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. ఇవన్నీ మనిషి స్వభావాన్ని, ఆధ్యాత్మిక సంక్షేమాన్ని తీర్చిదిద్దుతాయి.
అనేక విధాలుగా సోషల్ మీడియా కూడా మన దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించేది ఈ అంశాలనే.
మనం మాట్లాడేది తరచుగా మనం విన్నదాని ప్రభావంతో ఉంటుంది. మనం చూసేది మన కోరికలను ప్రభావితం చేస్తుంది. మన సమయాన్ని ఎలా గడుపుతున్నామో అది మన జీవిత దిశను తీర్చిదిద్దుతుంది.
అందువల్ల దీర్ఘకాలం, అధికంగా స్క్రీన్ ఉపయోగించడం మన అలవాట్లు, దృష్టి, భావోద్వేగ స్థితిని ప్రభావితం చేసి చివరకు మన హృదయాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు.
అందుకే హానికరమైన ప్రభావాల నుంచి మనలను మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యమైన సూత్రం.
డిజిటల్ యుగంలో పెరుగుతున్న వారికి ఒక సందేశం
ఇవన్నీ చెప్పినప్పటికీ, ఈ కొత్త నిషేధంతో చాలామంది యువత అసంతృప్తిగా ఉన్నారనేది స్పష్టమే.
పిల్లల చేతిలో నుంచి స్క్రీన్‌ను తీసుకోవడం ఎంత కష్టమో ఏ తల్లిదండ్రులకైనా తెలుసు. స్క్రీన్లకు బాగా అలవాటు పడిన తర్వాత చాలామంది పిల్లలు మొదట ఇలా అడగవచ్చు:
“ఇక మనం ఏమి చేస్తాం ?”
అయితే ఈ పరిస్థితిని మరో విధంగా కూడా చూడవచ్చు.
సరైన దృక్పథంతో చూస్తే, ఇది అభివృద్ధికి మరియు ఆత్మసంస్కరణకు ఒక అవకాశంగా మారవచ్చు.
సోషల్ మీడియా యొక్క నిరంతర ప్రభావం నుంచి కొంత దూరంగా ఉన్నప్పుడు, అంతులేని కంటెంట్‌ను అందించే ఒక అల్గారిథమ్ మిమ్మల్ని తీర్చిదిద్దడానికి బదులుగా, మీ వ్యక్తిత్వాన్ని మీరే స్పృహతో తీర్చిదిద్దుకోవడం ప్రారంభించవచ్చు.
ఈ సందర్భంలో పవిత్ర ఖుర్ఆన్లోని ఒక వాక్యం మనకు గుర్తుకు వస్తుంది. ఇటువంటి పరిస్థితిని ఆలోచించేటప్పుడు ఈ వాక్యం ఎంతో ప్రాసంగికంగా ఉంటుంది:
“ మీరు ఒక విషయాన్ని అసహ్యించుకోవచ్చు; అయితే అందులో మీకు మేలు ఉండవచ్చు. మీరు ఒక విషయాన్ని ఇష్టపడవచ్చు; అయితే అందులో మీకు కీడు ఉండవచ్చు.”
— పవిత్ర ఖుర్ఆన్, 2:217
సరైన దృక్పథంతో ఈ మార్పు అర్థవంతమైన మరియు దీర్ఘకాలికమైన మంచి ప్రభావాన్ని కలిగించవచ్చు.
మీ అభిప్రాయం ఏమిటి? ఈ మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? లేక మీ ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో మొదట్లో తెలియక ఇబ్బంది పడతారని అనుకుంటున్నారా?
మూలం:అల్ హక్కం.
ఎం ఎ జైనుల్ ఆబిదీన్ ఐరాపురం