మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి: మాజీ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్
ఈ69న్యూస్ | వరంగల్: అక్టోబర్ 15

సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని వరంగల్లోని రంగషాయిపేట బెస్తంచెరువు వద్ద చేపడుతున్న ఏర్పాట్లను వేగవంతం చేయాలని 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ అధికారులను కోరారు. పండుగకు వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్న బెస్తంచెరువు ప్రాంతాన్ని ఆయన సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బతుకమ్మలతో వచ్చే మహిళలు ఇబ్బందులు పడకుండా చెరువు మైదాన ప్రాంతంతోపాటు పరిసర రహదారులపై అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.ఉరుసు బైపాస్ రోడ్డు వైపు వెళ్లే మెటల్ రోడ్డు, ఖమ్మం రోడ్డు నుంచి నాయుడు పంపు వైపు వెళ్లే మెటల్ రోడ్డుపై డస్ట్ చల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే పండుగ సందర్భంగా భక్తులకు, మహిళలకు ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.చేపట్టిన పనులను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నిర్ణీత సమయంలోగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని గుండు చందన పూర్ణచందర్ కోరారు.ఈ కార్యక్రమంలో కాకతీయ సేవా సమితి అధ్యక్షుడు మండల నరసింహారాములు, శానిటరీ ఇన్స్పెక్టర్ భీమయ్య, శానిటరీ జవాన్లు అశోక్, ప్రణీత్, ప్రశాంత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.