అంబరానంటిన శ్రీ సీత రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం
48 వ డివిజన్ సారధి నగర ప్రాంతంలో 1972లో స్థాపితమైన శ్రీరామ మందిరంలో ఆలయ కమిటీ సభ్యులు దాతలు కందికొండ అరవింద్ నాగవేణి కుటుంబ సభ్యులచే శుక్రవారం శ్రీ సీత రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో ఆ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి దైవదర్శనాన్ని పొందారు. తదనంతరం భక్తులు స్వామివారి కళ్యాణ మండపంలో కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన పలు తీర్థ ప్రసాదములు మరియు తోట కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదములు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తోట రామారావు మాట్లాడుతూ సారధి నగర్ ప్రాంతంలో ఆనాడు కొందరి ముఖ్యులు ఆలోచన మేరకు అనేకమంది భక్తుల ప్రోత్సాహంతో 1972లో శ్రీరామ మందిరం నిర్మాణం చేసి ప్రతి సంవత్సరం భక్తులు అందిస్తున్న కానుకలతో ఆ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం మహోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించటం చాలా శుభ పరిణామం అని ఇంతటి భక్తి పర్వమైన కార్యక్రమం నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మా కుటుంబ సభ్యులకు ఆ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ రామ భక్తులకు అన్నప్రసాద వితరణ చేసే అవకాశం రావడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని తెలియ జేస్తూ ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత పాలకుడు శ్రీరామచంద్రమూర్తి అని లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచిన ఆ శ్రీ సీతారామచంద్ర ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అనేక మంది దాతలు, వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.