అత్యవసర వైద్య సిబ్బంది జాతీయ ఈఎంటి దినోత్సవ వేడుకలు
ఖమ్మం జిల్లాలో 108 అత్యవసర అంబులెన్స్ సేవల్లో పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటి)లకు జాతీయ ఈఎంటి దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. సత్తుపల్లిలో జరిగిన ఈ కార్యక్రమం 108 సేవల ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజీరుద్దీన్, జిల్లా మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజీరుద్దీన్ చేతుల మీదుగా కేక్ కటింగ్ నిర్వహించి, ఈఎంటీలను శాలువాలతో సత్కరించారు. వారి సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఈఎంటీలు గొల్లమందల కృష్ణ, యర్ణం అప్పారావు, కాకర్ల మాధవరావు, తేనేటి మురళీకృష్ణ పాల్గొన్నారు.
2005 ఆగస్టు 15న ప్రారంభమైన 108 అత్యవసర సేవలు అప్పటి నుంచి ఇప్పటివరకు రోగులు, క్షతగాత్రులు, కరోనా బాధితులకు నిరంతరం సేవలు అందిస్తున్నాయి. కోవిడ్ కరోనా సమయంలో ఉద్యోగులు దశలవారీగా హైదరాబాద్‌కు వెళ్లి విధులు నిర్వహించడం జరిగింది. మండల స్థాయిలో 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించారు.
గత ఏడాది కాలంలో జిల్లాలో మొత్తం 26,707 మందికి సేవలు అందించగా, అందులో రోడ్డు ప్రమాదాలు 4,146, గర్భిణీ స్త్రీలు 3,227, వైద్య కేసులు 8,695, గుండె సంబంధిత కేసులు 1,828, విషప్రయోగ కేసులు 1,353, పాము కాటు మరియు తేళ్ల కాటు కేసులు 725 నమోదయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే క్షణాల్లో ఘటనాస్థలికి చేరుకుని ప్రథమ చికిత్స అందించడం, ఉచిత ఆసుపత్రి సేవలు కల్పించడం, బాధితులను బాధ్యతాయుతంగా ఆసుపత్రులకు తరలించడం వంటి సేవలను ఈఎంటీలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అనేక సందర్భాల్లో గర్భిణీ స్త్రీలకు అంబులెన్స్‌లోనే ప్రసవాలు నిర్వహించి ప్రాణాలను కాపాడిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
జిల్లా మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజీరుద్దీన్ ప్రోత్సాహంతో ‘గోల్డెన్ అవర్’ విధానాన్ని పాటిస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సకాలంలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సేవా భావంతో ముందుకు సాగుతున్న ఈఎంటీలకు జాతీయ ఈఎంటి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.