ఆకేరు వాగులో యథేచ్ఛగా ఇసుక దందా
ప్రభుత్వ ఖజానాకు గండి
•అసైన్డ్ భూముల్లో అక్రమ తవ్వకాలు: వాహనాలు సీజ్ చేయాలని డిమాండ్
•రోళ్లకల్ వ్యక్తి ఇసుక దందాపై చర్యలు తీసుకోండి – కలెక్టర్కు విజ్ఞప్తి
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం రోల్లకల్ నారాయణపురం చెరువు సమీపంలోని తండాల పరిధిలో 374 సర్వే నంబర్ అసైన్డ్ భూముల్లో రోళ్లకల్కు చెందిన ఓ వ్యక్తి యథేచ్ఛగా సాగిస్తున్న అక్రమ ఇసుక రవాణాను వెంటనే నిలిపివేయాలని నారాయణపురం మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ, మండల కేంద్రంలోని 300కు పైగా ట్రాక్టర్ల డ్రైవర్లు, దినసరి కూలీలు ఇసుక రవాణాపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. గత మూడు నెలలుగా రెవెన్యూ, పోలీస్ అధికారులు అందరి వాహనాల ఇసుక రవాణాను నిలిపివేయగా, కేవలం రోళ్లకల్కు చెందిన వ్యక్తి ట్రాక్టర్లను మాత్రం యథేచ్ఛగా నడిపించుకునేందుకు స్వేచ్ఛ ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు.ఆకేరు వాగు నుంచి రోజూ పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నా ఏ అధికారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్ భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరిపి ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపించారు.జిల్లా కలెక్టర్, మైనింగ్ శాఖ, రెవెన్యూ,పోలీస్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సంబంధిత వ్యక్తి వాహనాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మండల కేంద్రంలో ట్రాక్టర్ల డ్రైవర్లు, కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు హెచ్చరించారు.