ఆర్టీసీ కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం
వరంగల్, సింగారం, నరసింహులగూడెం, ముల్కలగూడెం మీదుగా బస్సు రూట్ ఏర్పాటు
•గ్రామాల ప్రజలు ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచన
•కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోంది
•రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 290 కోట్ల మహిళల ఉచిత ప్రయాణాలు నమోదు
•మహిళలకు దాదాపు 10 వేల కోట్ల రూపాయల ప్రయాణ చార్జీల ఆదా
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పరిధిలోని పలు గ్రామాల ప్రజలు గత కొద్ది రోజులుగా తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేయగా వెంటనే స్పందించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సంబంధిత ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. దీనికి స్పందించిన ఆర్టీసీ అధికారులు వరంగల్ నుంచి కొండపర్తి వరకు కొత్త బస్సు సర్వీస్‌ను వయా తిమ్మాపూర్, సింగారం, నర్సింహులగూడెం, ముల్కలగూడెం గ్రామాల మీదుగా నడిపేలా ఏర్పాట్లు చేశారు.బుధవారం ప్రారంభమైన ఈ బస్సు సర్వీస్‌ను ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి,ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ..
ఈ బస్సు సర్వీస్ ద్వారా తిమ్మాపూర్, సింగారం, నర్సింహులగూడెం, ముల్కలగూడెం తదితర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు మరియు సాధారణ ప్రజలకు ఈ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ బస్సు సర్వీస్ వెళ్లే మార్గంలోని గ్రామాల ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అలాగే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇప్పటికే భారీగా లాభం చేకూరిందని చెప్పారు. ఇప్పటి వరకు మహిళల ఉచిత ప్రయాణాల ద్వారా సుమారు 290 కోట్ల ప్రయాణాలు జరిగాయని, దాదాపు 10 వేల కోట్ల రూపాయల మేర మహిళా ప్రయాణికుల చార్జీల ఆదా జరిగినట్లు ఆయన వెల్లడించారు.మహిళలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు వారికి సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ఎంతో గొప్పదని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రవాణా సౌకర్యాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే నాగరాజు కృషితో వరంగల్ నుంచి కొండపర్తి వరకు తిమ్మాపూర్, సింగారం, నర్సింహులగూడెం, ముల్కలగూడెం గ్రామాల మీదుగా కొత్త బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేశారు. నేడు ఈ బస్సు సర్వీస్ ప్రారంభం కావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ తమ గ్రామానికి ఎన్నో ఏండ్లుగా ఉన్న బస్సు ప్రయాణ కలను నెరవేర్చిన ఎమ్మెల్యే నాగరాజు కు కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేలా స్పందిస్తూ తమ గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించినందుకు ఎమ్మెల్యే నాగరాజు కు గ్రామస్తులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ బస్సు సర్వీస్ వల్ల గ్రామాల ప్రజలకు ఎంతో సౌలభ్యం కలుగుతుందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, ఆర్టీసీ అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.