జిల్లా ఆసుపత్రి పరిస్థితులపై ఎమ్మెల్యే గండ్ర ఆగ్రహం
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన ఆయన,వివిధ విభాగాలను సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా క్యాజువాల్టీ,ల్యాబొరేటరీ,ఎంఆర్ఐ,ఔట్‌పేషెంట్ విభాగాలను తనిఖీ చేసి వైద్య సేవల పరిస్థితిని తెలుసుకున్నారు.క్యాజువాల్టీలో కేవలం ఆరు పడకలు మాత్రమే ఉండడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు వివరించగా,వెంటనే 15 పడకలతో కొత్త క్యాజువాల్టీ నిర్మాణానికి ప్రణాళికలు,అంచనాలు సిద్ధం చేసి సమర్పించాలని టీజీఎంఐడీసీ అధికారులను ఆదేశించారు.ల్యాబ్‌లో అవసరమైన పరికరాల లభ్యతపై విచారించిన ఎమ్మెల్యే,ఆసుపత్రిలో పారిశుద్యం దయనీయంగా ఉండటం,వార్డులు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రోగులకు అందాల్సిన ప్రాథమిక సౌకర్యాలు సరైన స్థాయిలో లేవని పేర్కొన్నారు.సిబ్బంది సమయపాలన పాటించకపోవడం,విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం వంటి అంశాలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ,బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.ఆసుపత్రి నిర్వహణ బాధ్యత వహిస్తున్న అధికారులను కఠినంగా హెచ్చరిస్తూ,పారిశుద్యం,నిర్వహసిబ్బంది హాజరు,పనితీరును మెరుగుపరచాలని ఆదేశించారు.రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేస్తూ,అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలని సూచించారు.ఇకపై నిర్లక్ష్యం కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం ఆసుపత్రి ఆవరణలోని మహిళా క్యాంటీన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే,రోగి బంధువులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.క్యాంటీన్లో పరిశుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌తో కలిసి టిఫిన్స్ రుచిచూశారు.ఈ తనిఖీలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య,వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్,అదనపు కలెక్టర్ విజయలక్ష్మి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్,ఆసుపత్రి పర్యవేక్షకులు డా.రాజేంద్రప్రసాద్,వైద్య సిబ్బంది,స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.