ఎస్ ఐ ఆర్ పేరుతో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు బీజేపీ కుట్ర
ఎస్ ఐ ఆర్ పేరుతో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు బీజేపీ కుట్ర
బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
రైతు డిస్కంను ఉపసంహరించుకోవాలి.
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
తెలుగు గళం న్యూస్, ఖమ్మం పట్టణం/ జూన్ 03, ఖమ్మం జిల్లా : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు కాపాడుకోవాలని, ఎస్ ఐ ఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక ధ్రువీకరణ) పేరుతో మైనారిటీలు, దళితులు, ఆదివాసీల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ఆరోపించారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవనం నందు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ధ్రువీకరణ పత్రాల లేమి కారణంగా పేద ప్రజలు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రజాస్వామ్య విధానానికి బదులుగా ప్రభుత్వమే ఓటర్లను ఎంపిక చేసే పరిస్థితికి దేశాన్ని నెట్టివేస్తోందన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులన్నీ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు వ్యవసాయ రంగానికి సంబంధించి మాట్లాడుతూ, రైతుల పొలాల్లో విద్యుత్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రైతు డిస్కంను తీసుకొచ్చిందన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతు డిస్కం ద్వారా రైతులు, పేద ప్రజలకు అందుతున్న విద్యుత్ సబ్సిడీలను ఎత్తివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందుగానే అందుబాటులో ఉంచాలని, నాణ్యమైన వ్యవసాయ ఇన్పుట్ల సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి బ్యాంకు రుణాలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్,కళ్యాణం వెంకటేశ్వరరావు, వై. విక్రమ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు,
భూక్య వీరభద్రం, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ,
మెరుగు సత్యనారాయణ, యం. గోపాల్ రావు మరియు జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.