కోమటిపల్లి అడవిలో ప్రకృతి బీభత్సం
నేలమట్టమైన మహావృక్షాలు!
అటవీ సంపదకు భారీ నష్టం.. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టాలి: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు
అడవుల పరిరక్షణలో నిర్లక్ష్యం తగదు.. శాస్త్రీయ అధ్యయనం, అటవీ పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ ములుగు జిల్లా మంగపేట మండలం పరిధిలోని కోమటిపల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యంతో భారీ మహావృక్షాలు నేలకూలిన ఘటన పర్యావరణ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటనలో దెబ్బతిన్న అటవీ ప్రాంతాన్ని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు స్వయంగా సందర్శించి పరిశీలించారు. నేలకూలిన మహావృక్షాలు, ధ్వంసమైన అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తూ స్థానికులు, అటవీ శాఖ సిబ్బందితో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ, మేడారం అటవీ ప్రాంతంలో గతంలో జరిగిన ప్రకృతి విపత్తును తలపించేలా కోమటిపల్లి అడవిలో కూడా భారీ నష్టం సంభవించడం అత్యంత బాధాకరమన్నారు. బలమైన ఈదురుగాలులు, సుడిగాలి లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో వందల ఏళ్ల వయస్సు కలిగిన మహావృక్షాలు నేలకూలడం సాధారణ విషయం కాదని, దీనిపై అటవీ శాఖ ఉన్నతాధికారులు శాస్త్రీయంగా అధ్యయనం చేసి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అడవులు కేవలం చెట్ల సమాహారం మాత్రమే కాదని, అవే పర్యావరణ సమతుల్యతకు మూలాధారమని, వర్షపాతం, భూగర్భ జలాల పరిరక్షణ, వన్యప్రాణుల నివాసం, జీవవైవిధ్య పరిరక్షణలో అడవుల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలతో అడవులు దెబ్బతింటే భవిష్యత్ తరాలకు తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్గా తీసుకుని వెంటనే ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నష్టాన్ని అంచనా వేయాలని, కూలిపోయిన చెట్లను శాస్త్రీయ పద్ధతిలో తొలగించి, అదే ప్రాంతంలో విస్తృత స్థాయిలో అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అలాగే నేలకూలిన ప్రతి మహావృక్షానికి బదులుగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు అటవీ ప్రాంతాల్లో ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, వాతావరణ మార్పులపై నిరంతర అధ్యయనం నిర్వహించాలని, అడవుల సంరక్షణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అడవుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రకృతి సంపదను కాపాడడం ద్వారా మాత్రమే పర్యావరణ సమతుల్యతను రక్షించగలమని లక్ష్మణ్ బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాటి కృష్ణ, కాకులమర్రి ప్రదీప్ రావు, తుమ్మ మల్లారెడ్డి, బాడిషా నాగ రమేష్, కూనూరు అశోక్ గౌడ్, చిట్టి మల్ల సమ్మయ్య, సిద్ధంశెట్టి లక్ష్మణరావు, ఎస్.కె. కుర్బాన్ అలీ, యలవర్తి శ్రీనివాసరావు, తాడూరి రఘు, కర్ర రవీందర్, ఎండి. అయూబ్, జాడి భోజారావు, సంకోజు ప్రశాంత్, మూగల రమేష్, రావుల రమణ సంతోష్, గండపల్లి నర్సయ్య, మునగాల నరేష్, మునిగల సాంబులు, పుల్ల సోయం ఈశ్వరయ్య, వంశీ, మునగాల మహేష్, జాడి కృష్ణతో పాటు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.