గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ
భూపాలపల్లి జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.బుధవారం కాటారం మండలం మేడిపల్లి గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ,తరగతి గదులు, విద్యార్థుల వసతి గృహాలు,భోజనశాలను సమగ్రంగా పరిశీలించారు.విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు,మౌలిక వసతులు,పరిశుభ్రత, ఆహార నాణ్యత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.చదువుపై ఆసక్తి పెంపొందించుకోవాలని, శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులను ప్రోత్సహించారు.అనంతరం వసతి గృహాల నిర్వహణ, సిబ్బంది కొరత, మౌలిక వసతుల పరిస్థితి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. విద్యార్థుల హాజరు శాతం పెంచడం, బోధన నాణ్యతను మెరుగుపరచడం,హాస్టళ్లలో శుభ్రతను పాటించడం,సమయానికి పోషకాహారం అందించడం వంటి అంశాలపై సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, పాఠశాలల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో ఎంపిడిఓ బాబు, నాయబ్ తహసీల్దార్ రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.