గుడుంబా స్థావరాలపై మెరుపు దాడులు
అక్రమ గుడుంబా తయారీని అరికట్టేందుకు రేగొండ ఎస్సై డి.సుధాకర్ కఠిన చర్యలు చేపడుతున్నారు.ఆయన ఆధ్వర్యంలో దమ్మన్నపేట గ్రామంలో పక్కా సమాచారంతో నిర్వహించిన మెరుపు దాడుల్లో అక్రమ గుడుంబా తయారీ స్థావరాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడిలో ఐలు శ్రీనివాస్ నివాసంలో సుమారు 4 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం నిబంధనల ప్రకారం గుడుంబాను సీజ్ చేసి, నిందితుడిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి. సుధాకర్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై డి. సుధాకర్ మాట్లాడుతూ, గుడుంబా తయారీ, నిల్వ, రవాణా, విక్రయం పూర్తిగా చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే పోలీసుల ముఖ్య లక్ష్యమని, గుడుంబా వంటి నిషేధిత మద్యాలు అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు.అలాగే గ్రామాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఎక్కడైనా గుడుంబా తయారీ లేదా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రజల సహకారంతో మండలాన్ని అక్రమ కార్యకలాపాల నుంచి పూర్తిగా స్వచ్ఛంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఎస్సై డి. సుధాకర్ తెలిపారు.