గురివింద’ రాజకీయం మీది… ప్రజాపక్షం మాది!
తెలంగాణ సమాజం కోసం,ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖకు సమాధానం చెప్పలేక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యక్తిగత దూషణలకు దిగడం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.పర్వతగిరిలో ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మంత్రి లేఖపై తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీకి కేటీఆర్ రాసిన లేఖలో లేవనెత్తిన ప్రజాస్వామ్యబద్ధమైన అంశాలపై మాట్లాడే ధైర్యం లేక, కేటీఆర్ వ్యక్తిగత పర్యటనలను ముడిపెడుతూ లేఖ రాయడం కాంగ్రెస్ దివాళాకోరుతనానికి అద్దం పడుతోందని ఆరోపించారు.
పర్యటనలపై ఏడుపెందుకు?
కేటీఆర్ ఎక్కడికి వెళ్లినా ఆయన ఆలోచన,శ్వాస అంతా తెలంగాణ ప్రజల గురించే ఉంటుందని,ఎండల్లో అల్లాడుతున్న ప్రజలు,నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు, కాంగ్రెస్ వైఫల్యాలపై ఆయన నిరంతరం స్పందిస్తున్నారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. విదేశీ పర్యటనల గురించి మాట్లాడే లక్ష్మణ్, మీ అధినేత రాహుల్ గాంధీ దేశంలో ఏ చిన్న సమస్య వచ్చినా బ్యాంకాక్, ఇటలీ ప్రయాణాలు కట్టే విషయాన్ని మరిచిపోయారా? అని ప్రశ్నించారు.
రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కుందా?
దేశంలో అత్యవసర పరిస్థితి విధించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి,రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అలాంటి పార్టీకి చెందిన మీరు కేటీఆర్‌కు రాజ్యాంగం గురించి పాఠాలు చెబుతారా? అని నిలదీశారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపితే అది నిరంకుశత్వమా? అని ప్రశ్నించారు.
ప్రగతి భవన్ ‘సమస్యల నిలయం’ అయింది ప్రగతి భవన్ చుట్టూ కంచెలు తొలగించామని ప్రగల్భాలు పలుకుతున్న మీరు, ఈరోజు ప్రజా భవన్ ముందు క్యూ కడుతున్న నిరుద్యోగులను,ఆటో కార్మికులను అరెస్టులు చేయిస్తున్నది నిజం కాదా?లాఠీచార్జీలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది మీ ప్రభుత్వం కాదా? అని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు.గురివింద గింజ సామెత మీకే వర్తిస్తుంది
“గురివింద గింజ తన కింద నలుపు ఎరుగదు”అనే సామెత వందకు వంద శాతం మీ కాంగ్రెస్ ప్రభుత్వానికే సరిపోతుందని ఆయన అన్నారు. ఆరు గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చి,ఆరు నెలలు దాటినా ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చని మోసం మీది కాదా? రైతు భరోసా లేదు, రుణమాఫీ ఊసు లేదు, నిరుద్యోగ భృతి లేదు… ఈ నలుపు మీ కళ్లకు కనిపించడం లేదా? అని విమర్శించారు.కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు ఆపి, ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో, ఎండిపోతున్న చెరువులకు నీళ్లు ఎలా ఇవ్వాలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా ఇవ్వాలో ఆలోచించాలని,ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది ఇచ్చిన మాట తప్పి తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తున్న మీ కాంగ్రెస్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు