రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు యార అజయ్ రెడ్డి మండిపాటు
రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు యార అజయ్ రెడ్డి మండిపాటు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి మొగుళ్ళపల్లి
దేశంలో గత కొద్ది రోజులుగా నిత్యావసర వస్తువులతో పాటు వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం మోపుతోందని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ రెడ్డి యార తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు వంట గ్యాస్ ధరలను పెంచి గృహిణుల పొట్ట కొట్టిందని మండిపడ్డారు. గత మార్చి 7వ తేదీన ఒకేసారి రూ. 60 పెంచిన కేంద్రం, ఇప్పుడు మళ్లీ అదనంగా రూ. 29 పెంచి సామాన్యుల పట్ల తమకున్న నిర్లక్ష్యాన్ని చాటుకుందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఎలాంటి అడ్డుఅదుపు లేకుండా క్రమంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ పోవడం దారుణమన్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా దగ్గరలో ఎన్నికలు లేకపోవడంతోనే, ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎన్డీయే ప్రభుత్వం ఈ తీరుగా దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మళ్లీ ఎప్పుడు, ఎంత ధర పెంచుతారోననే భయాందోళనల మధ్య మధ్యతరగతి కుటుంబాలు బతుకులీడుస్తున్నాయని అజయ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కంటితుడుపు చర్యలు స్వస్తి పలికి, పెంచిన వంట గ్యాస్, ఇంధన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన పద్ధతి మార్చుకోకుండా ధరలను ఇలాగే కొనసాగిస్తే, సామాన్య ప్రజలను మరియు కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తామని, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని అజయ్ రెడ్డి యార హెచ్చరించారు. ఈ నిరసన ప్రకటనలో స్థానిక యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.