చట్టాలపై అవగాహన సదస్సు – సమాజ చైతన్యానికి కీలక అడుగు
ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణంలో చట్టాలపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ పుట్ట రేణుక కుమార్ , వల్లేపురెడ్డి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈ సదస్సుకు హనుమకొండ కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ జి. రామలింగం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని తెలిపారు. చట్టాలపై సరైన అవగాహన ఉంటేనే వ్యక్తులు తమ హక్కులను రక్షించుకోవడంతో పాటు, సమాజంలో న్యాయం నిలబెట్టగలరని అన్నారు.అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి. అనూష మాట్లాడుతూ మహిళల హక్కులు, బాల్య వివాహాల నిరోధక చట్టాలు, గృహ హింస నిరోధక చట్టాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ముఖ్యంగా బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, వాటిని అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అడ్వకేట్ సొల్లేటి రామకృష్ణ మాట్లాడుతూ న్యాయ సేవలను ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉచిత న్యాయ సలహాలు, చట్టాల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.సర్పంచ్ పుట్ట రేణుక కుమార్ మాట్లాడుతూ గ్రామంలో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తామని తెలిపారు.గ్రామస్థులు చట్టాలను గౌరవించి, సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ సదస్సులో పోలీసులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం చివరగా చట్టాలపై ప్రజల్లో చైతన్యం పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని అధికారులు కోరారు