డాక్టర్లు, నర్సుల ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి
పెనుబల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఎం మండల కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు చలమాల విఠల్ రావు, మండల కార్యదర్శి గాయం తిరుపతిరావుతో పాటు మండల కమిటీ సభ్యుల బృందం ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించింది.
ఈ సందర్భంగా ఇన్‌పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వైద్యశాల ప్రధాన వైద్యుడు డాక్టర్ కే. కిరణ్‌కుమార్‌ను కలిసి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది కొరతపై చర్చించారు.
ఈ సందర్భంగా ప్రధాన వైద్యుడు మాట్లాడుతూ, ఆసుపత్రిలో 20 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం ఏడుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. గైనకాలజీ విభాగంలో మహిళలు, గర్భిణీలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నామని, అలాగే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధుల నిర్ధారణకు రక్త పరీక్షలు, ప్లేట్లెట్స్ కౌంటింగ్ వంటి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నర్సింగ్ సిబ్బంది కూడా 12 మంది ఉండాల్సి ఉండగా సగం మంది మాత్రమే పనిచేస్తున్నారని, మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
ఈ సందర్భంగా చలమాల విటల్‌రావు మాట్లాడుతూ, రోజూ సుమారు 500 మంది వరకు రోగులు వైద్య సేవల కోసం ఆసుపత్రికి వస్తున్నప్పటికీ తగినంత మంది డాక్టర్లు, నర్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలోకి వైద్య సేవలను మార్చినప్పటికీ అవసరమైన వైద్య సిబ్బందిని నియమించకపోవడం ప్రభుత్వ ప్రజారోగ్యంపై నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో: సీపీఎం మండల కమిటీ సభ్యులు నల్లమల అరుణ ప్రతాప్, కండే సత్యం, చిలకా రామచంద్రు, తడకమళ్ల చిరంజీవి, వడ్డేపల్లి రవీంద్ర, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.