త్యాగభావాన్ని పెంపొందించడమే బక్రీద్ సందేశం-ఎమ్మెల్యే నాగరాజు
హజ్రత్ ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఐనవోలు మండల కేంద్రంలోని ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొని ముస్లిం సోదర, సోదరీమణులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ముస్లిం సోదరులు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వార్థం, అసూయ,రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగభావాన్ని పెంపొందించడమే బక్రీద్ ముఖ్య సందేశమని అన్నారు.త్యాగబుద్ధి, నిజమైన భక్తిప్రపత్తులు కలిగినవారే దైవకృపకు పాత్రులవుతారని తెలిపారు.నేటి ఆధునిక సమాజంలో సాటి మనిషిని ప్రేమించి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేసే వారే నిజమైన దైవభక్తులని పేర్కొన్నారు.హజ్రత్ ఇబ్రహీం చూపిన త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పరస్పర ప్రేమాభిమానాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి,సామరస్యాలు నెలకొనాలని,ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఐనవోలు మండల ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా,మండల,గ్రామస్థాయి నాయకులు,ముస్లిం మత పెద్దలు, సోదరులు పాల్గొన్నారు.