దళిత రత్న అవార్డు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ జీలుకర కృష్ణాకర్
డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్, ఉద్యమ కళాకారుడు జీలుకర కృష్ణాకర్ కి ప్రతిష్టాత్మక “దళిత రత్న” అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలను సమాజంలో విస్తరించడంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేశారు. జీలుకర కృష్ణాకర్ జర్నలిజం రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందడమే కాకుండా, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా SC, ST, BC వర్గాల స్వరాన్ని సమాజానికి వినిపించేందుకు ఆయన “బహుజన న్యూస్ టీవీ”ను స్థాపించడం విశేషం. ఈ ఛానల్ ద్వారా అణగారిన వర్గాల సమస్యలు, హక్కులు, అభివృద్ధి అంశాలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ, బహుజన వర్గాల అభ్యున్నతికి మీడియా వేదికగా బహుజన న్యూస్ టీవీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. జీలుకర కృష్ణాకర్ సామాజిక ఉద్యమాలతో పాటు కళారంగంలో కూడా ప్రజలలో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. అవార్డు స్వీకరించిన అనంతరం జీలుకర కృష్ణాకర్ మాట్లాడుతూ, ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను పెంచిందని చెప్పారు. డా. బి.ఆర్. అంబేద్కర్ చూపిన సమానత్వ మార్గంలోనే ముందుకు సాగుతూ, బహుజన వర్గాల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, కళాకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణాకర్ కి అభినందనలు తెలిపారు