నాగార్జునసాగర్ విద్యా పర్యటన
విద్యను పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా అనుభవాత్మకంగా, సమగ్రంగా అందించాలనే లక్ష్యంతో ధర్మసాగర్ జెడ్పిహెచ్ఎస్ బాలుర పాఠశాల మరియు ఎంపీపీఎస్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు కలిసి చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత గల నాగార్జునసాగర్–నాగార్జునకొండలకు విద్యా పర్యటన నిర్వహించారు.ఈ పర్యటన ద్వారా విద్యార్థులు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజవంశాల చరిత్రను ప్రత్యక్షంగా తెలుసుకునే అరుదైన అవకాశం పొందారు.నాగార్జునకొండ పురావస్తు సంగ్రహాలయంలోని శాసనాలు, శిల్పాలు, పురాతన వస్తువులను పరిశీలించడం ద్వారా బౌద్ధ యుగం, అప్పటి సామాజిక జీవనం, సాంస్కృతిక వైభవంపై స్పష్టమైన అవగాహన కలిగింది.తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలకు ఇది ప్రత్యక్ష అనుసంధానంగా నిలిచింది.నాగార్జునసాగర్ ఆనకట్ట సందర్శన విద్యార్థులకు జలవనరుల నిర్వహణ, నదీ పరివాహక ప్రాజెక్టుల ప్రాధాన్యత, వ్యవసాయ మరియు ఆర్థికాభివృద్ధిలో వాటి పాత్రపై అవగాహన పెంచింది. లాంచ్ ప్రయాణం ద్వారా కృష్ణా నది పరిసరాల ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పర్యావరణ సమతుల్యతపై చైతన్యం పొందారు.విద్యతో పాటు సామాజిక అనుబంధం, సాంస్కృతిక వ్యక్తీకరణ ఈ పర్యటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాటలు, నృత్యాల్లో పాల్గొనడం ద్వారా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.బుద్ధవనంలో నిర్వహించిన సంయుక్త భోజనం ఐక్యత, సహకార భావాలను బలోపేతం చేసింది.ఈ విద్యా పర్యటనను ప్రధానోపాధ్యాయులు కే.బి. ధర్మప్రకాశ్ నేతృత్వంలో, సమన్వయకర్త రాజమ్మ సమర్థవంతంగా నిర్వహించారు.ఉపాధ్యాయులు కవితా దేవి, సురేష్, కిరణ్మయీ, ప్రసన్న, సురేష్ పూర్తి సహకారం అందించారు.అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ మమతతో పాటు ఉపసిబ్బంది అజ్మీరి బేగం, పూలమ్మ, శ్యామల, రాధలు కీలక పాత్ర పోషించారు. మొత్తం 52 మంది విద్యార్థులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.