పోటు రంగారావుపై అక్రమ కేసులు రద్దు చేయాలి
సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుపై జాతీయ దర్యాప్తు సంస్థ నమోదు చేసిన ఉపా చట్టం కేసును తక్షణమే రద్దు చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామంలో శుక్రవారం జరిగిన సమావేశంలో మండల కమిటీ ఈ మేరకు తీర్మానం చేసింది.
సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వాదుల గొంతుకను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదుదశాబ్దాలుగా పోటు రంగారావు భూమి, భుక్తి, విముక్తి లక్ష్యంగా రాజ్యాంగబద్ధంగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు.ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడిపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం నేరంగా పరిగణించడం సరైంది కాదని తెలిపారు.
ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడాన్ని ఖండించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా జరుగుతున్న ఈ చర్యలను నిలిపివేసి, పోటు రంగారావుపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో అవుకు వెంకన్న, గంటా శ్రీనివాసరావు, అమర్లపూడి శరత్, తాటి రాజు, కందిమల్ల నాగప్రసాద్, పాండు, వాసు, కృష్ణవేణి, అలివేలు, జాపాలి తదితరులు పాల్గొన్నారు.