ప్రారంభోత్సవానికి హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
ప్రారంభోత్సవానికి హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి, జూన్ 5
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న 11వ యూత్ తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా బాస్కెట్‌బాల్ ఛాంపియన్షిప్-2026 పోటీలను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. అనంతరం బాస్కెట్‌బాల్ గోల్ వేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగడానికి క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు.ప్రపంచ బాస్కెట్‌బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్ ను ఆదర్శంగా తీసుకుని యువ క్రీడాకారులు తమ లక్ష్యాల సాధన కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు.గెలుపు-ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని, ఓటమి ఎదురైనా నిరుత్సాహపడకుండా మరింత కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.తాను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో బాస్కెట్‌బాల్, క్రికెట్ ఆడానని, బాస్కెట్‌బాల్ అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని ఎంపీ పేర్కొన్నారు.భూపాలపల్లిలో నిర్వహిస్తున్న ఈ రాష్ట్రస్థాయి పోటీలు యువ క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునేందుకు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు.ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున క్రీడాకారులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ తెలిపారు.ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఖేలో ఇండియా కార్యక్రమాల స్ఫూర్తితో తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు వేదికగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.పాఠశాల విద్యార్థులను ప్రతిభావంతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం స్పోర్ట్స్ స్కూల్‌ను మంజూరు చేసిందని తెలిపారు. అలాగే హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల వద్ద 30 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు ప్రారంభించామని వెల్లడించారు.క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ అవకాశాలు, ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ, ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారుడు ఉత్తమ ప్రతిభ కనబర్చి తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ఎస్పీ సంకీర్త్, బాస్కెట్‌బాల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సింగరేణి జీఎం రాజేశ్వర్, జెన్కో సీఈ ప్రకాశ్, మున్సిపల్ చైర్మన్ కొమురయ్య, జిల్లా క్రీడా అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.