మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సర్పంచ్
గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానం దర్శించుకున్న మల్లికుదుర్ల గ్రామ సర్పంచ్ జక్కుల మౌనిక సంపత్
వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామానికి చెందిన సర్పంచ్ జక్కుల మౌనిక సంపత్ మహాశివరాత్రి సందర్భంగా గట్టు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులందరికీ ఆమె మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
సర్పంచ్ మౌనిక సంపత్ మాట్లాడుతూ, భక్తులు సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలని పరమశివుని కరుణాకటాక్షం కలిగి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థించినట్లు తెలిపారు. సహనానికి, త్యాగానికి ప్రతీకగా సృష్టి లయకారుడైన ఉమామహేశ్వరుడు భక్తులచే అనునిత్యం ఈ దేవస్థానంలో పూజలందుకుంటున్నారని పేర్కొన్నారు.
భక్తిశ్రద్ధలతో కొలిస్తే సామాన్య భక్తుల కోరికలూ తీర్చే భోళాశంకరుడిగా భారతీయ ఆధ్యాత్మిక, సామాజిక జీవనంలో పరమశివునికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రాణికోటిని రక్షిస్తూ సృష్టి మనుగడ కోసం గరళాన్ని మింగిన మహాత్యాగి, ఆదియోగి, గరళకంఠుడు పరమేశ్వరుడిని ఆమె కొనియాడారు.
భక్తులందరికీ సుఖశాంతులు ప్రసాదించి ప్రాంతం మరింత అభివృద్ధి చెందేలా దీవెనలు అందించాలని మహాదేవుని వేడుకున్నట్లు తెలిపారు. “కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమైన దేవుడా… ఓట్టు మల్లన్నా… మల్లోస్తా గట్టు మల్లన్నా” అనే నినాదం ఇక్కడి భక్తుల విశ్వాసానికి ప్రతీక అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.