
ఈ69న్యూస్ వరంగల్ ఏప్రిల్ 21
వరంగల్ నగరంలోని మట్టెవాడ బోడ్రాయి ప్రాంతానికి చెందిన భూపాలపల్లి పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) మంగళవారం రోజు విషాదకరంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.మట్టెవాడ పోలీసుల వివరాల ప్రకారం, మంగళవారం రోజు ఉదయం విధులకు వెళ్లిన ఆమె 9:30 గంటలకే తిరిగి ఇంటికి వచ్చారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6:45 గంటల మధ్య సమయంలో, తన అత్తగారి ఇంట్లో చీరతో ఫ్యాన్ హుక్కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. సాయంత్రం ఉద్యోగం ముగించుకుని ఇంటికి వచ్చిన భర్త, ఆమె మృతదేహం వేలాడుతూ కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.ఘటనా స్థలంలో లభించిన ఆత్మహత్య లేఖలో, శ్రీధర్ అనే కానిస్టేబుల్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని, ఆ వేధింపుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సాదు సంగీత పేర్కొన్నట్లు సమాచారం.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఆత్మహత్య ప్రేరణతో పాటు ఇతర సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మట్టెవాడ ఎస్హెచ్ఓ వెల్లడించారు.ఈ ఘటనతో పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.