మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు
ప్రశాంత,నిష్పక్షపాత ఎన్నికలే లక్ష్యం – ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించాలి:జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ తెలిపారు.ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించడమే జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. మొత్తం ఎన్నికల నిర్వహణను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎలక్షన్ సెల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాలు, కీలక ప్రాంతాలు సీసీ కెమెరాల నిఘాలో ఉంచి, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తామని పేర్కొన్నారు.ఎన్నికల ప్రచార గడువు రేపు అనగా ఈ నెల 9వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని తెలిపారు. ఆ తర్వాత ఎవరూ కూడా ప్రచారం నిర్వహించరాదని స్పష్టం చేశారు. అభ్యర్థులు లేదా వారి మద్దతుదారులు నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,అవసరమైతే కేసులు నమోదు చేసి అభ్యర్థిత్వం రద్దయ్యే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించారు.సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సైలెన్స్ డేగా అమలు చేస్తామని తెలిపారు.ఈ సమయంలో స్థానికేతరులు, ఓటర్లు కానివారు కాలనీలు, వార్డుల్లో తిరగరాదని ఆదేశించారు. అలాగే ఓటర్లను డబ్బు, మద్యం లేదా ఇతర బహుమతులతో ప్రలోభాలకు గురిచేస్తే సంబంధితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా, ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.