మేడారం అభివృద్ధి నిధులతో జిమ్ సెంటర్ ఏర్పాటు..?
- మేడారం అభివృద్ధి నిధులతో జిమ్ సెంటర్ ఏర్పాటు..? రూ.20 లక్షల ఖర్చుపై వెంటనే విజిలెన్స్ విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేసి పి.వో ని భర్తరఫ్ చేయాలి
- గిరిజనులకు బోర్లు, రోడ్లు, ఇతర సంక్షేమ అభివృద్ధి పనులు అలాగే ఆశ్రమ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడం పక్కనపెట్టి అధికారి ఫిట్నెస్కే ప్రజాధనమా..? బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..!
- గిరిజనుల సమస్యలు గాలికొదిలి అధికారుల విలాసమైన సౌకర్యాలకే ప్రజాధనం దుర్వినియోగం ..!
- మేడారం అభివృద్ధి నిధుల వినియోగంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలి ఆదివాసీ గిరిజన సంఘాల డిమాండ్
ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో మేడారం సమ్మక్క–సారలమ్మ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన రూ.1.50 కోట్ల నిధుల్లో రూ.20 లక్షలను జిమ్ సెంటర్ ఏర్పాటుకు వినియోగించినట్లు వస్తున్న సమాచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐటీడీఏ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో, ప్రాజెక్ట్ అధికారి కోసం ఈ జిమ్ సెంటర్ ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి. ఒకవైపు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలు తాగునీరు, బోర్లు, విద్యుత్, రహదారులు వంటి కనీస మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తుండగా, వందలాది మంది గిరిజనులు దర్బార్లలో దరఖాస్తులు ఇచ్చి నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా వారి సమస్యలకు పరిష్కారం లభించడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోన్న తరుణంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో బాత్రూములు, మరుగుదొడ్లు, సరిగా లేక వాటికీ డోర్ లు కూడా లేక, తాగునీరు, వసతి వంటి ప్రాథమిక సౌకర్యాలు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో లేని పరిస్థితి కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించిన నిధులను అధికారులు వారి సౌకర్యాల కోసం వినియోగించబడ్డాయనే ఆరోపణలు అది అత్యంత తీవ్రమైన నేరం. కాబట్టి ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై స్వతంత్ర విచారణ జరిపి, రూ.20 లక్షల వ్యయం ఏ నిబంధనల ప్రకారం ఖర్చు చేయడం జరిగింది..? ఎవరి అనుమతితో జరిగింది..? అనే విషయాలను ప్రజలకు వెల్లడించాలి. ఆరోపణల్లో నిజానిజాలను తేల్చి, నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇకపై గిరిజనుల అభివృద్ధి కోసం కేటాయించే ప్రతి రూపాయి లక్ష్యానికి అనుగుణంగానే ఖర్చయ్యేలా కఠిన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.