మేడిగడ్డ–కాళేశ్వరం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మేడిగడ్డ,కాళేశ్వరం ప్రాంతాలను సందర్శించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. అనంతరం కాటారం మండలం నస్తూరిపల్లిలో నిర్వహించనున్న కార్యక్రమంలో రైతు భరోసా రెండో విడత నిధులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.ఈ మేరకు శుక్రవారం జిల్లా ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతు భరోసా నిధుల రెండో విడత విడుదల కార్యక్రమాన్ని భూపాలపల్లి జిల్లాలో ప్రారంభించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.నస్తూరిపల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ సంఖ్యలో రైతులు,మహిళలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, సభా ప్రాంగణం, భద్రత, రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అన్ని మౌలిక వసతులను సమగ్రంగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా ప్రతి అంశాన్ని ముందస్తుగా సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, కౌన్సిలర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.