మైనింగ్ తవ్వకాలు అక్రమమా సక్రమమా?
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామ శివారులో జరుగుతున్న మైనింగ్ తవ్వకాలు అక్రమమా సక్రమమా అనేది ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ గిరిజనేతర్లకు అనుమతులు ఎవరు ఎలా ఇచ్చారు ఆ డీల్ వెనుక నోట్ల కట్టలు దాగి ఉన్నాయా అనే గుస గుసలు వినవస్తున్నాయి.
ఇచ్చిన అనుమతులకు మించి లోతులో క్యూబిక్ మీటర్ల లోతు తవ్వుతున్నట్లు విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది.ఇంత జరుగుతున్న పట్టించుకోవాల్సిన
రెవిన్యూ,ఫారెస్టు,రిజర్వ్ ఫారెస్ట్,మైనింగ్ శాఖ అధికారులు కనుచూపు మేరలో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.దీని వెనుక ముచ్చటగా మూడు శాఖలాధికారులు ముడుపులు తీసుకుని ఉన్నారా లేక కొందరి బడా బకాసురులు ఒత్తిడికి కిమ్మనకుండా ఉంటున్నారా అనేది సందేహంగా ఉంది.
ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వడానికి ఎవరు పేరుమీద అనుమతులు ఇచ్చారు’ ఎవరు ఇచ్చారు లేక గుట్ట గుటకాయస్వాహ నా అనే ప్రశ్న ప్రజలలో లేక పోలేదు.మరో వైపు చూస్తే
ఈ క్రషర్ గ్రానైట్ తవ్వకాల వల్ల చుట్టుపక్కల గ్రామాలలో దుమ్ము,ధూళి తో వాయు కాలుష్యం ఏర్పడి ప్రజలకు శ్వాస కోశ సంబంధిత వ్యాధులు వస్తున్న దుస్థితి అగుపిస్తుంది. రైతులు సాగు చేస్తున్న వరి,పొగాకు,పత్తి, మిరప మరియు మామిడి తోటలు ధ్వంసం అయి పూసిన పూత రాలి పోతున్న దుస్థితి,కొంత భాగం కాత లేక రైతుల ఆందోళన చెందుతున్నారు.ఈ విషయమై జిల్లా కలక్టర్ కు తమ మోర చెప్పుకోవడానికి రైతులు సోమవారం ప్రజావాణి కి వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది అక్రమ తవ్వకాలు క్రషర్ మైనింగ్ వల్ల చుట్టుపక్కల గ్రామాలు 100 నుంచి 150 ఎకరాల భూసారం దెబ్బతిని జల వనరులు సైతం అడుగంటటం జరుగుతుంది. రైతుల పంటలు దిగుబడులేక అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నారు. ప్రజలకు,రైతులకు న్యాయం చేయాల్సిన అధికారులు,పాలకులు ఇప్పటికైనా స్పందించాలని ప్రజా సంఘాలు ఘోషిస్తున్నాయి.ఇకపోతే సంబంధిత రెవెన్యూ, ఫారెస్ట్,రిజ్వర్ ఫారెస్ట్, గ్రామపంచాయతీ కార్యదర్శులు రైతులు పక్షమా’ అక్రమ మైనింగ్ పక్షమా తెలుసుకోవాల్సి ఉంది.మొత్తంగా చూస్తే ఇదంతా పర్యావరణ విధ్వంసం కాదా.