రైతులకు బంగారు అవకాశం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా ప్రారంభించారు. రైతులకు మద్దతు ధరను అందిస్తూ, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో రైతులు,ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.కేంద్ర ప్రారంభం అనంతరం ఎమ్మెల్యే రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటకు క్వింటాల్‌కు రూ.2400 చొప్పున చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. ఈ ధర ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో రైతులకు లాభదాయకమని పేర్కొన్నారు. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా నేరుగా పంటను విక్రయించాలని సూచించారు.రైతుల ఆదాయాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని హామీ ఇచ్చారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు.వ్యవసాయానికి అనుబంధంగా ఉద్యానవన రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ,భూపాలపల్లి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఐదు రకాల కూరగాయల విత్తనాలను పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు.ఈ విత్తనాలు రైతులకు అదనపు ఆదాయాన్ని అందించే అవకాశముందని తెలిపారు.ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ అధికారి ఎడ్ల సునీల్ కుమార్ మాట్లాడుతూ, రైతులు తమ భూముల్లో కూరగాయల సాగు చేపట్టడం ద్వారా తక్కువ కాలంలో మంచి లాభాలు పొందవచ్చని వివరించారు.మండల కేంద్రంలోనే విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో సంబంధిత అధికారులను సంప్రదిస్తే విత్తనాలు పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులకు సాగు పద్ధతులు, మార్కెట్ అవకాశాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ,ఉద్యానవన శాఖల అధికారులు రైతులతో చర్చించి సందేహాలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ సిబ్బంది, రైతు సంఘాల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు న్యాయమైన ధర లభించడంతో పాటు వ్యవసాయ రంగంలో స్థిరత్వం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి చర్యలు రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా గ్రామీణాభివృద్ధికి దోహదపడతాయని కార్యక్రమంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.