లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలపై వెంటనే స్పందన.. జేసీబీతో ట్రెంచ్, కరకట్ట గేట్లు తెరిపించి నీటి తొలగింపు
వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు.. బ్లీచింగ్, ఆయిల్ బాల్స్, కాచి చల్లార్చిన నీరే తాగాలని సూచన భారీ వర్షాల కారణంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని 4వ వార్డులో వర్షపు నీరు నిలిచిపోవడంతో సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు వెంటనే స్పందించి ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణ సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ జేసీబీతో నీరు బయటకు వెళ్లేలా ట్రెంచ్ తవ్వించడంతో పాటు, ఇరిగేషన్ ఏఈ రాజుతో మాట్లాడి కరకట్ట గేట్లు తెరిపించారు. లోతట్టు ప్రాంతాల నుంచి నీరు పూర్తిగా తొలగే వరకు గేట్లు తెరిచి ఉంచాలని అధికారులను కోరారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలంలో కలుషిత నీటి వల్ల డయేరియా, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి కుటుంబం కాచి చల్లార్చిన నీటినే తాగాలని సర్పంచ్ సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు, దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ వేయనున్నట్లు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు నిరంతరం కొనసాగుతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజు, మధు, చిన్ని, బాబా, గ్రామ పంచాయతీ సిబ్బంది మినాజ్, రాంబాబు, ప్రణయ్ పాల్గొన్నారు.