
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సేవలందించి ఇటీవల సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ అయిన ఐపీఎస్ అధికారి సన్ ప్రీత్ సింగ్‌కు గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ పరేడ్ మైదానంలో ఘన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది సన్ ప్రీత్ సింగ్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఆయనను నిలబెట్టి, పోలీస్ అధికారులు తాళ్లతో ఆ వాహనాన్ని లాగుతూ తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుతూ భావోద్వేగపూరితంగా వీడ్కోలు పలికారు. ఈ దృశ్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన సన్ ప్రీత్ సింగ్, “వరంగల్ పోలీసులు తమతో కలిసి పనిచేసిన అధికారులను ఎప్పటికీ గుండెల్లో నిలుపుకుంటారు. ఇది నాకు ఎంతో భావోద్వేగానికి గురిచేసిన విషయం” అని అన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో 15 నెలలపాటు విధులు నిర్వహించిన సమయంలో ప్రతి అధికారి, ప్రతి పోలీస్ సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. కమిషనరేట్‌లోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంలో విశేష ఫలితాలు సాధించామని తెలిపారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, ఇక్కడి అధికారులు, సిబ్బంది, ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు జీవితాంతం గుర్తుండిపోతాయని అన్నారు. భవిష్యత్తులో కూడా వరంగల్ పోలీస్ కమిషనరేట్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డీసీపీలు ధార కవిత, రాజమహేంద్ర నాయక్, అదనపు డీసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్ రావు, బాలస్వామి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు (ఆర్ఐలు)తో పాటు పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.