వ్యవసాయ బావిలో యువతి మృతదేహం
ఈ నెల 29 న పెళ్లికి ఏర్పాట్లు చేసిన తల్లిదండ్రులు
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మరిపెడ పోలీసులు పెళ్లి కోసం ఇరు కుటుంబాలతో పోరాడి ఆత్మహత్యాయత్నం చేసి చివరకు పెద్దలను ఒప్పించారు.. ఇద్దరి కుటుంబాలు ఒప్పుకొని ఈనెల 29వ తారీఖున పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. ఇంతలోనే ఇంట్లో విషాదం.. మరో వారం రోజుల్లో పెళ్లి ఉందనగా తండా సమీపంలో ఓ వ్యవసాయ బావిలో అనుమానాస్పద స్థితిలో యువతి శవమైంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఇటుకల గడ్డ తండాలో బుధవారం చోటుచేసుకుంది,బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మరిపెడ మండలం ఇటుకల గడ్డ తండాకు చెందిన భూక్య వెంకన్న- వినోదల కుమార్తె భూక్య సంగీత (20), కొత్త తండాకు చెందిన అజ్మీరా గోవిందు కుమారుడు అజ్మీర అరవింద్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఈ విషయమై తల్లిదండ్రులను ఒప్పించేందుకు గతంలో సంగీత పురుగుల మందు కూడా తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో చేసేది లేక పెద్దలు పెళ్లికి అంగీకరించి ఈ నెల 29వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. కాగా మంగళవారం సాయంత్రం ప్రియుడి ఇంట్లో ఓ శుభకార్యముండగా సంగీత కుటుంబాన్ని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే వారు గోవింద్ ఇంటికి వెళ్ళగా.. ప్రియుడు అరవింద్ యువతి వద్దకు వచ్చి తీసుకుని వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అనంతరం సంగీత బుధవారం ఉదయం ఇటుకల గడ్డ తండా సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో పడి చనిపోయినట్లుగా స్థానికులు తెలిపారు. అయితే బావి సమీపంలో రక్తం మరకలతో కూడిన చెప్పులు ఉండడంతో యువతి మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మరిపెడ ఎస్సై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.