
యుద్ధ ప్రాతిపదికన కొత్త భవనం నిర్మించాలని సీపీఎం డిమాండ్
ఈ69 న్యూస్ చిల్పూరు, జూన్ 29 (తెలుగు గళం)జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని చిన్న పెండ్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ పాఠశాలకు యుద్ధ ప్రాతిపదికన నూతన భవనం నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధి బృందం చిన్న పెండ్యాల ప్రభుత్వ హైస్కూల్, రాజవరం కేజీబీవీ పాఠశాలలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్య బలోపేతం గురించి మాట్లాడుతున్నప్పటికీ, చిన్న పెండ్యాల హైస్కూల్ పరిస్థితి చూస్తే ప్రభుత్వ పనితీరు స్పష్టమవుతుందని విమర్శించారు.పాఠశాలలోని తరగతి గదులు ఎప్పుడు కూలిపోతాయోనన్న భయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే మూడు తరగతి గదులు కూలిపోయాయని, మిగిలిన శిథిల భవనాలను పూర్తిగా తొలగించకపోవడంతో ప్రమాదం మరింత పెరిగిందన్నారు.పాఠశాలకు ప్రహరీ గోడ, ప్రధాన గేటు లేకపోవడం, మరుగుదొడ్లు, మూత్రశాలలు నిరుపయోగంగా ఉండడం, కోతుల బెడద తీవ్రంగా ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫాంలు, పూర్తి స్థాయిలో నోట్‌బుక్స్ అందలేదని, 8వ తరగతి వృక్షశాస్త్రం, 9వ తరగతి హిందీ పాఠ్యపుస్తకాలు ఇంకా రాలేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన 20 రకాల వస్తువులతో కూడిన విద్యార్థుల కిట్లు కూడా ఇప్పటివరకు పంపిణీ కాలేదన్నారు.అలాగే రాజవరం గ్రామపంచాయతీ పరిధిలోని కేజీబీవీ పాఠశాలలో కూడా మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రహరీ గోడ లేకపోవడం వల్ల విద్యార్థినుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, బట్టలు ఆరబెట్టేందుకు షెడ్ కూడా లేకపోవడంతో వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వసతి గృహంలో పరిశుభ్రత, ఆహార నాణ్యత కూడా సరిగా లేదని ఆరోపించారు.పాఠశాలల సమస్యలపై ఉపాధ్యాయులను సంప్రదించేందుకు ప్రయత్నించగా నిర్లక్ష్యంగా స్పందించారని, తమ పిల్లలను రెండు నిమిషాలు చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులకూ అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. జిల్లాలో విద్యాశాఖ అధికారులు గాఢనిద్రలో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.చిన్న పెండ్యాల హైస్కూల్ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది.సమస్యల పరిష్కారం కోసం జూలై 2న మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని రాపర్తి రాజు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి సాదం రమేష్, జిల్లా కమిటీ సభ్యులు మునిగెల రమేష్, ఉపసర్పంచ్ గద్ద కోమల, వార్డు సభ్యుడు ఊరడి బుచ్చిరాజ్, రైతు సంఘం మండల అధ్యక్షుడు గద్ద కుమార్, కర్రె నాగరాజు, ఊరడి రవి, పోలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.