శివసాయి నగర్లో డ్రైనేజీ సమస్యలపై తెలుగుగళం ఫోకస్
ఖమ్మంజిల్లా
సత్తుపల్లి పట్టణంలోని 5.వార్డు లో గల శివసాయి నగర్ కాలనీ ను తెలుగుగళం తెలుగు జాతీయ దినపత్రిక ప్రతినిధి మల్లూరు చంద్రశేఖర్ బుదవారం పరిశీలించారు.
గత కొన్ని ఏళ్లుగా మౌలిక వసతుల అభివృద్ధికి నోచుకోకుండా శివసాయి నగర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని గమనించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను పరిశీలించిన మల్లూరు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు ఎక్కడపడితే అక్కడ నిల్వ ఉంటోందని కాలనీవాసులు వాపోయారు. ముఖ్యంగా వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారి, వర్షపు నీరు మొత్తం కాలనీలోనే నిలిచిపోతుందని తెలిపారు. ఇటీవల బైక్ ల చోరీలతో ఆందోళనకు గురి అవుతున్నామని గళం ఎదుట స్థానికులు తమ గళం విప్పారు. సమస్యను చూసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిల్వ నీటి కారణంగా కాలనీలో విపరీతంగా దోమలు పెరిగి, దుర్వాసన వెదజల్లుతోందని దీంతో ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
శివసాయి నగర్లో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచి, మురుగునీటిని గాడిదల వాగులో కలిసేలా శాశ్వత ప్రణాళిక రూపొందించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.పోలీసులు రాత్రి సమయంలో గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు బానోత్ విజయ్, మంద శివ మాట్లాడుతూ కాలనీవాసుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శివసాయి నగర్ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.