
పాత పెన్షన్ పునరుద్ధరణే సామాజిక భద్రతకు నిజమైన హామీ
–రాపర్తి రాజు
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు, జనగామ
ప్రపంచవ్యాప్తంగా నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాల సంక్షేమ బాధ్యతలు క్రమంగా తగ్గిస్తూ,మార్కెట్ ఆధారిత విధానాలకు ప్రాధాన్యం పెంచే ధోరణి బలపడింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల బలహీనీకరణ,సామాజిక భద్రతా పథకాల కుదింపు వంటి చర్యలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్),నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అమలు కూడా అదే విధానంలో భాగంగా చూడాల్సిన అవసరం ఉంది.పెన్షన్ అనేది ప్రభుత్వం ఉద్యోగికి ఇచ్చే దానం కాదు.అది ఉద్యోగి జీవితాంతం చేసిన సేవకు లభించే హక్కు.కార్మిక ఉద్యమ దృష్టిలో పెన్షన్ అంటే “డిఫర్డ్ వేజ్”(వాయిదా వేసిన వేతనం).ఉద్యోగి వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఇది సామాజిక భద్రతకు కీలకమైన ఆధారం.పాత పెన్షన్ విధానంలో పదవీ విరమణ అనంతరం ఉద్యోగికి నిర్ధారిత నెలవారీ పెన్షన్,కుటుంబ పెన్షన్ వంటి భరోసా ఉండేది.కానీ సీపీఎస్/ఎన్పీఎస్లో ఉద్యోగి,ప్రభుత్వం చెల్లించిన చందాలను మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టి,వాటి లాభనష్టాల ఆధారంగా పెన్షన్ నిర్ణయిస్తారు.దీంతో ఉద్యోగి భవిష్యత్తు మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి అనిశ్చితిలో పడుతుంది.ఇది సంక్షేమ రాజ్య స్ఫూర్తికి విరుద్ధం.ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో శాశ్వత ఉద్యోగాలు తగ్గుతూ,కాంట్రాక్టు,అవుట్సోర్సింగ్ విధానాలు పెరుగుతున్నాయి.అదే సమయంలో శాశ్వత ఉద్యోగులకు కూడా పెన్షన్ భద్రత బలహీనపడుతోంది.ఇది కార్మిక వర్గం దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను వెనక్కి నెట్టే ప్రక్రియగా కనిపిస్తోంది.భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు సామాజిక భద్రత,గౌరవప్రదమైన జీవనం,ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వాల బాధ్యతగా పేర్కొన్నాయి.ఉద్యోగి వృద్ధాప్యాన్ని భద్రంగా ఉంచడం కూడా అదే బాధ్యతలో భాగం.కానీ నయా ఉదారవాద విధానాలు ఈ బాధ్యతను మార్కెట్పైకి మళ్లిస్తున్నాయి.దేశవ్యాప్తంగా లక్షలాది మంది సీపీఎస్ ఉద్యోగులు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం ఉద్యమిస్తున్నారు.వారి డిమాండ్ కేవలం ఆర్థిక ప్రయోజనం కోసం కాదు;పదవీ విరమణ అనంతరం గౌరవప్రదమైన జీవన హక్కు కోసం.ఉపాధ్యాయులు, వైద్యులు,రెవెన్యూ,పోలీసు,పంచాయతీ తదితర శాఖల ఉద్యోగులు సమాజానికి అందిస్తున్న సేవలకు భద్రమైన పెన్షన్ కల్పించడం ప్రభుత్వ నైతిక,రాజ్యాంగబద్ధ బాధ్యత.తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో ఉద్యోగులు ఎన్నికల హామీల అమలును కోరుతూ పోరాడుతున్నారు.ప్రభుత్వాలు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకోవాలి.కార్మిక ఉద్యమ చరిత్ర చెబుతున్నది ఒక్కటే-ఎనిమిది గంటల పని దినం,కనీస వేతనం,గ్రాట్యుటీ, ఈఎస్ఐ,పీఎఫ్,ప్రసూతి సెలవులు,పెన్షన్ వంటి హక్కులన్నీ పోరాటాల ద్వారానే సాధించబడ్డాయి.కాబట్టి పెన్షన్ హక్కును కూడా అదే పోరాట స్ఫూర్తితో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.సీఐటీయూ ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ,ప్రైవేటు,అసంఘటిత రంగ కార్మికులందరికీ సమగ్ర సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తోంది.వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితం ప్రతి శ్రామికుడి హక్కు.ప్రభుత్వ ఉద్యోగులకు హామీతో కూడిన పెన్షన్,అసంఘటిత రంగ కార్మికులకు సార్వత్రిక సామాజిక భద్రత-ఈ రెండూ సంక్షేమ రాజ్య నిర్మాణానికి అత్యవసరం.