దేవాదుల ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తాం*-ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
తెలుగు గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్, జూన్ 9
జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో తెలంగాణ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రూ.60.62 కోట్ల వ్యయంతో నిర్మించిన, నిర్మించనున్న 7 విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై అభివృద్ధి పనులను ప్రారంభించారు.రూ.43.92 కోట్ల వ్యయంతో నిర్మించిన పీచర 132/33 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు కొండాపూర్, సాగరం, కుర్చపల్లి 33/11 కేవీ సబ్స్టేషన్లను ప్రారంభించారు. అలాగే పల్లగుట్ట, లింగంపల్లి, నష్కల్ ప్రాంతాల్లో నిర్మించనున్న మూడు నూతన 33/11 కేవీ సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు స్త్రీనిధి, బ్యాంకు లింకేజ్ రుణాల చెక్కులను పంపిణీ చేశారు.
“దేవాదుల ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తాం*-ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఒకప్పుడు వలసలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.వ్యవసాయం, తాగునీరు, పారిశ్రామికాభివృద్ధికి విద్యుత్ కీలకమని పేర్కొన్నారు. ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
లక్ష ఎకరాలు సాగులోకి వచ్చాయి- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, దేవాదుల ప్రాజెక్టు, ఉచిత విద్యుత్ కారణంగా నియోజకవర్గంలో లక్ష ఎకరాలు సాగులోకి వచ్చాయని తెలిపారు.ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక వరి ధాన్యం దిగుబడి స్టేషన్ ఘనపూర్‌లో నమోదవుతోందన్నారు.కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసిందని చెప్పారు.రఘునాథపల్లి 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను 220/132 కేవీ సబ్‌స్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని, విద్యుత్ లైన్ల షిఫ్టింగ్‌కు నిధులు కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను గతంలో మాదిరిగా మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు.
స్టేషన్ ఘనపూర్‌కు విద్యుత్ వెలుగులు నింపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం -ఎంపీ డాక్టర్ కడియం కావ్య
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, గత పదేళ్లుగా అభివృద్ధి పరంగా వెనుకబడిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వెలుగులు నింపుతోందన్నారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి విజ్ఞప్తి మేరకు ఏడు సబ్స్టేషన్లకు ఆమోదం తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.ఒకేసారి రూ.60 కోట్లకు పైగా నిధులతో ఏడు సబ్స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ప్రభుత్వ అభివృద్ధి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, ప్రస్తుతం పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ ఆర్థిక భారం తగ్గిస్తోందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి సుమారు రూ.1,400 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే కుట్రలను ప్రజలు అప్రమత్తంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, మామిడాల యశస్విని రెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.