హత్య కేసును ఛేదించిన పోలీసులు
రేగొండ మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురు ప్రధాన నిందితులతో పాటు ఒక మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూపాలపల్లి డిఎస్పీ ఎ. సంపత్ రావు నేతృత్వంలో ఘన్పూర్ సీఐ సిహెచ్. కరుణాకర్ రావు, రేగొండ ఎస్సై డి.సుధాకర్, కొత్తపల్లి గోరి ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి లతో కూడిన పోలీస్ బృందం ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది.ఈ క్రమంలో మంగళవారం డిఎస్పీ సంపత్ రావుకు అందిన నమ్మదగిన సమాచారం మేరకు.. నిందితులు దమ్మన్నపేట క్రాస్ రోడ్డు మీదుగా పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, ఎస్సై సుధాకర్ తన సిబ్బందితో కలిసి అక్కడ తనిఖీలు చేపట్టారు.టీవీఎస్ స్కూటీపై అనుమానాస్పదంగా వస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు.ప్రధాన నిందితుడి భార్యతో మృతుడు అక్రమ సంబంధం పెట్టుకోవడంతో పాటు,గతంలో తీసుకున్న ఐదు లక్షల రూపాయల అప్పును పదే పదే అడుగుతూ వేధిస్తున్నాడనే కక్షతోనే ఈ హత్యకు ఒడిగట్టినట్లు వెల్లడైంది.నిందితుడు తన సోదరుడు,మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ముందస్తు పథకం ప్రకారం తల్వార్,కత్తి కొనుగోలు చేసి దాచిపెట్టారు.ఈ నెల 3వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో మృతుడు పనిచేస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముందు కాపు కాసి, ఒక్కసారిగా తల్వార్, కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.ఈ కేసులో రేగొండకు చెందిన మల్లెబోయిన శ్రీకాంత్ (30), కొడవటంచకు చెందిన మల్లెబోయిన చింటు అలియాస్ రాజేష్ (22), రేగొండకు చెందిన కురకుల సందీప్ (25) లతో పాటు ఒక మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి హత్యకు ఉపయోగించిన ఒక తల్వార్, ఒక కత్తి, నేరం జరిగిన సమయంలో వారు ధరించిన రక్తపు మరకల దుస్తులు, ఒక టీవీఎస్ స్కూటర్, ఒక యామహా ఎఫ్‌జెడ్ మోటార్ సైకిల్,ఒక మొబైల్ ఫోన్‌ను స్వతంత్ర సాక్షుల సమక్షంలో పోలీసులు చట్టప్రకారం స్వాధీనం చేసుకున్నారు.నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించిందని, కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని డిఎస్పీ సంపత్ రావు తెలిపారు.