ఫారెస్ట్ అధికారులను నిలదీసిన రైతులు, గ్రామస్థులు
జేసీబీలను అడ్డుకుని పనులు నిలిపివేత!
ఎన్నేళ్లుగా సాగు చేస్తున్న భూముల్లో కందకాలు తవ్వొద్దు… ఫారెస్ట్ అధికారులను నిలదీసిన రైతులు, గ్రామస్థులు
పోడు భూముల పరిరక్షణ కోసం గ్రామస్థుల ఆందోళన… మల్యాలలో ఉద్రిక్తత, అధికారులతో వాగ్వాదం
తెలుగు గళం ఏటూరునాగారం, ములుగు :
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మల్యాల గ్రామంలో శుక్రవారం ఉదయం ఫారెస్ట్ శాఖ చేపట్టిన ట్రెంచింగ్ (కందకాలు) పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ పరిసరాల్లో ఎన్నో సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేస్తున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు జేసీబీలతో కందకాలు తవ్వడం ప్రారంభించగా, భారీ సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి చేరుకుని పనులను నిలిపివేశారు. తమ జీవనాధారమైన సాగు భూములను ధ్వంసం చేస్తూ ట్రెంచింగ్ పనులు చేపట్టడం అన్యాయమని గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, స్థానికులతో చర్చించకుండా పనులు ప్రారంభించడం సరైంది కాదని అధికారులను నిలదీశారు. పోడు భూములపై తమ హక్కులను కాపాడుకునేందుకు అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు. ఘటనాస్థలంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, ఫారెస్ట్ అధికారులు గ్రామస్థులతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే తమ సమస్యకు స్పష్టమైన హామీ లభించే వరకు ట్రెంచింగ్ పనులను అనుమతించబోమని గ్రామస్థులు స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, అధికారులు తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది.