అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలోని అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు.శనివారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కలెక్టర్కు మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమాచార వారధులుగా పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తారని, జిల్లా సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.2026–2028 సంవత్సరాలకు సంబంధించి అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హత కలిగిన జర్నలిస్టులకు మాత్రమే కార్డులు జారీ చేయాలని సూచించారు. ముఖ్యంగా సంస్థ గుర్తింపు పత్రం, విద్యార్హతలు మరియు ఇతర కీలక అంశాలను సమగ్రంగా తనిఖీ చేయాలని డీపీఆర్వోకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు వివిధ మీడియా ప్రతినిధుల నుండి 330 ఆన్లైన్ దరఖాస్తులు అందాయని, వాటిని నిబంధనల మేరకు త్వరితగతిన పరిశీలించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీపీఆర్వో శీలం శ్రీనివాస్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు క్యాతం సతీష్ కుమార్,మంతెన సమ్మయ్య, ఎర్రం సతీష్ కుమార్, మోబిన్ అహ్మద్, జి. సారేశ్వరరావు, పాలకుర్తి మధు తదితరులు పాల్గొన్నారు.కాగా సామంతుల శ్యామ్ ప్రసాద్, జల్దీ రమేష్, మహమ్మద్ షమీ, అజ్మీర డాకు నాయక్ అనివార్య కారణాల వల్ల ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు.