ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి ఖండన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా పట్టణ బీఆర్ఎస్ నాయకులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ,రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రధాన ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయంపైనే దాడులు జరుగుతుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు.ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు కలిగిస్తున్నాయని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాల మాదిరిగా ప్రవర్తిస్తూ,ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఒక ప్రతిపక్ష నేత కార్యాలయంలో బలవంతంగా ప్రవేశించి పోస్టర్లు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.ప్రజలు ఈ విధమైన రాజకీయాలను గమనిస్తున్నారని,తగిన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.పోలీసులు చట్టాన్ని కాపాడాల్సింది పోయి,పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం చేశారు.దాడులకు పాల్పడుతున్న వారిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని విమర్శించారు.ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని గుర్తుచేశారు.భూపాలపల్లి జిల్లాలో ఇటీవల జరుగుతున్న దొంగతనాలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని,శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా,మున్సిపల్ పరిపాలనలో లోపాలున్నాయని,బడ్జెట్ ప్రవేశపెట్టే విధానంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.ఓడిపోయిన అభ్యర్థులు ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడం సరైంది కాదని అన్నారు.విద్యా రంగంపై మాట్లాడిన గండ్ర,ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.విద్యాసంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని,విద్యార్థులపై భారమవుతోందని పేర్కొన్నారు.హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే పరిస్థితి మారిందని అన్నారు.రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ,జిల్లాలో మక్కజొన్న పంట సిద్ధమైనప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని విమర్శించారు.రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.