E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ3 July, 2026E69NEWS

ఎమ్మెల్యే గారూ…మా ఊరికి రోడ్డు ఎప్పుడు వేస్తారూ?

రెండున్నరేళ్లుగా రోడ్డు కోసం ఎదురుచూపులు

రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పి రెండున్నరేళ్లు…హామీ అమలు ఎక్కడ?

సాగరం–గర్మళ్లపల్లి రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం

జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం సాగరం క్రాస్ రోడ్డు నుంచి సాగరం–తిడుగు మీదుగా గర్మళ్లపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన తారు రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరినా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంపై ఇరు గ్రామాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ రహదారిని విస్తరించి, మెరుగైన రహదారిగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు.”రోడ్డు విస్తరణ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తాం” అని అప్పట్లో చెప్పిన మాటలు ఇప్పటికీ ఆచరణలోకి రాలేదని వారు విమర్శిస్తున్నారు.అయితే కాలం గడుస్తున్నా రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కాకపోగా, కనీసం మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. భారీ గుంతలు, పగుళ్లతో నిండిపోయిన ఈ రహదారిపై ప్రయాణించడం నిత్యకృత్యంగా ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.ప్రతిరోజూ ఈ రహదారిపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు,ఆటోలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రహదారి పూర్తిగా చెరువును తలపిస్తోంది.దీంతో గుంతల లోతు కనిపించక వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది.అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు సైతం వేగంగా వెళ్లలేని పరిస్థితి ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.వ్యవసాయ పనుల కోసం నిత్యం ఈ రహదారిని వినియోగించే రైతులు ఎరువులు,పంట పొలాలకు తీసుకుపోవడానికి, అలాగే పంటలను మార్కెట్‌కు తరలించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మరింత కష్టాలను ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు తెలిపారు.”ఎన్నికల సమయంలో మాత్రమే గ్రామాలు గుర్తొస్తాయా? ఓట్లు పూర్తయ్యాక ప్రజల సమస్యలు కనిపించవా? రోడ్డు విస్తరణ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? అభివృద్ధి మాటల్లోనేనా?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి ఇచ్చిన హామీ మేరకు సాగరం–తిడుగు–గర్మళ్లపల్లి రహదారి విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని, అప్పటి వరకు అత్యవసర మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *