కాకతీయ యూనివర్సిటీలో వైభవంగా ప్రారంభమైన తీజ్ ఉత్సవాలు
కాకతీయ విశ్వవిద్యాలయంలో (కేయూ) గిరిజన సాంప్రదాయ తీజ్ ఉత్సవాలు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలు, సంస్కృతీ సంప్రదాయాల నడుమ ఘనంగా ప్రారంభమయ్యాయి.ఉత్సవాల తొలిరోజు సందర్భంగా బంజారా ఆడపడుచులు,విశ్వవిద్యాలయ విద్యార్థినులు కలిసి బంజారుల ఆరాధ్య దైవమైన శ్రీ సీతలా భవాని మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రకృతి పండుగగా ప్రసిద్ధి చెందిన ఈ తీజ్ వేడుకల్లో భాగంగా బుట్టలలో గోధుమలు చల్లే సంప్రదాయ కార్యక్రమాన్ని గిరిజన యువతులు అత్యంత పవిత్రంగా నెరవేర్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిజిస్ట్రార్,బంజారా ప్రొఫెసర్లు సురేష్ లాల్, హనుమంతు, రమేష్ తదితరులు మాట్లాడుతూ… ఈ రోజు నుండి ప్రారంభమైన తీజ్ వేడుకలు కేయూ క్యాంపస్‌లో తొమ్మిది రోజుల పాటు అత్యంత పవిత్రంగా, వైభవంగా కొనసాగుతాయని వెల్లడించారు.విశ్వవిద్యాలయంలోని మేధావులు, అధ్యాపకులు, ఉద్యోగులు,విద్యార్థి-విద్యార్థినులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకలను దిగ్విజయం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు నాయక్, మహేందర్ నాయక్, వెంకట్ నాయక్, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు అశోక్ నాయక్, రాజేందర్, శ్రీకాంత్ జాదవ్, సచిన్, సురేష్‌లతో పాటు బంజారా ఆడబిడ్డలు శ్రావణి, నందిని, మౌనిక, శివాని, జ్యోతి, విద్యార్థినులు, నేతలు పాల్గొన్నారు.