పాలనలో ఏఐ వినియోగంపై పూర్తి అవగాహన ఉండాలి
ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడే జిల్లా సమగ్రాభివృద్ధి వేగవంతమవుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు.గురువారం కలెక్టరేట్ (ఐడీఓసీ) కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం టీ-ఫైబర్ ఆధ్వర్యంలో “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియెన్సీ” అనే అంశంపై నిర్వహించిన ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏఐ ఆధారిత సాంకేతిక పరికరాల వినియోగం,ఫైళ్ల నిర్వహణ, నివేదికల తయారీ, డేటా విశ్లేషణ, సమయం ఆదా చేసే పద్ధతులు, ప్రజా సేవల్లో సాంకేతికత పాత్రపై నిపుణులు అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ… కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రతి అధికారి, ఉద్యోగికి సరైన శిక్షణ అవసరమన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఐఏఎస్ అధికారులతో పాటు జిల్లా స్థాయిలోని అన్ని శాఖల అధికారులకు ఏఐపై పట్టు సాధించేలా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న “తెలంగాణ రైజింగ్-2047” లక్ష్య సాధనలో జిల్లాల ప్రగతి అత్యంత కీలకమని పేర్కొన్నారు.అయితే,ప్రస్తుతం చాలామంది అధికారులు చాట్‌జీపీటీ,క్లాడ్ వంటి ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నప్పటికీ,వాటిపై పూర్తిగా ఆధారపడకుండా తగిన జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ సూచించారు. ఏఐ అనేది కేవలం మన పనులను సులభతరం చేస్తూ జ్ఞానాన్ని పెంచే ఒక సాధనం మాత్రమేనని, ఏదైనా అంశంలో తుది నిర్ణయం తీసుకునే బాధ్యత పూర్తిగా అధికారులదేనని స్పష్టం చేశారు. ఏఐ ఇచ్చే సమాచారాన్ని, సూచనలను తప్పనిసరిగా ధృవీకరించుకున్న తర్వాతే వాడుకోవాలని హితవు పలికారు.అనంతరం జిల్లా పరిపాలనలో ఏఐ సాంకేతికతను ఎలా ఉపయోగించాలో కొన్ని సాధనాలను అధికారులకు ప్రాక్టికల్‌గా ప్రదర్శించి వివరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఏఐ నిపుణులు ధీరజ్, రాహుల్, ఈడీఎం శ్రీకాంత్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.