కాళేశ్వరంలో అంత్య పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
కాళేశ్వరంలో అంత్య పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఈ నెల 21 నుండి జూన్ 1వ తేదీ వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా గోదావరి నదిలోని ప్రధాన ఘాట్‌ను సందర్శించిన కలెక్టర్,భక్తుల భద్రత,సౌకర్యార్థం నదిలో క్వయర్ మ్యాట్లను ఏర్పాటు చేయాలని,పారిశుద్ధ్య పనులను మరింత వేగవంతం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు వీలుగా కీలక ప్రాంతాల్లో సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.అనంతరం విఐపిల రాక కోసం సిద్ధం చేస్తున్న హెలిప్యాడ్‌ను పరిశీలించి,దాని చుట్టూ బలమైన బ్యారికేడ్లు నిర్మించాలని,ధూళి లేవకుండా నీరు చల్లాలని సూచించారు.ప్రధాన ఘాట్ నుండి సరస్వతి ఘాట్ వరకు నిర్మించిన తాత్కాలిక రహదారిపై నిరంతరం నీటిని చల్లుతూ ఉండాలని,రోడ్డు మరమ్మతులు,పెయింటింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.అటుపై సరస్వతి ఘాట్ వద్ద భక్తులు దుస్తులు మార్చుకునే గదులు,షవర్ ట్యాప్స్ సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు.గోదావరి నదిలో నీటి మట్టం ఎక్కువగా ఉన్నందున, భక్తులు ప్రమాదవశాత్తు లోపలికి వెళ్లకుండా ప్రతి 50 మీటర్లకు రక్షణ బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని,ఘాట్ల వద్ద నిరంతరం పహారా కాసేందుకు అనుభవజ్ఞులైన గజ ఈతగాళ్లను నియమించాలని ఎస్పీ సంకీర్త్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఘాట్ మెట్లపై వేసిన అచ్చుల డిజైన్లకు రంగులు వేయడంతో పాటు భక్తుల కోసం కేటాయించిన స్టాల్స్,టెంట్ సిటీ ప్రాంతాలను కూడా వారు పరిశీలించారు.కాళేశ్వరంలోని మ్యూజియాన్ని సందర్శించిన కలెక్టర్, పుష్కరాలకు సమయం తక్కువగా ఉన్నందున పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని,మ్యూజియంలోని ప్రతి విగ్రహం వద్ద దానికి సంబంధించిన పూర్తి సమాచార బోర్డులను ప్రదర్శించాలని స్పష్టం చేశారు.ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్,విజయలక్ష్మి,ఆర్డీఓలు హరికృష్ణ,రవీందర్‌లతో పాటు ఇరిగేషన్,ఆర్ అండ్ బి,పంచాయతీరాజ్,విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.