నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ పెట్టాలి:సీపీఐ (ఎంఎల్) డిమాండ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం కామ్రేడ్ బందు సుజాత అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మాట్లాడుతూ.. వానాకాలం సాగు సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో జిల్లాలోని అమాయక రైతులను నిలువునా ముంచేందుకు నకిలీ విత్తన మాఫియా రంగంలోకి దిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉన్న ఫెర్టిలైజర్ షాపులను మండల వ్యవసాయ అధికారులు (ఏ ఓ) నిరంతరం తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు.ఎక్కడైనా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు తేలితే సదరు దుకాణాల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు, యజమానులపై కఠినమైన ‘పీడీ యాక్ట్’ కింద కేసులు నమోదు చేయాలని అధికారులను కోరారు.షాపుల యజమానులు విత్తనాలను ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే సహించేది లేదని మల్లేష్ హెచ్చరించారు.విత్తనాలు,ఎరువులు కొనుగోలు చేసిన ప్రతి రైతుకూ ఖచ్చితంగా కంప్యూటర్ బిల్లులు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకపక్క ‘రైతే రాజు’ అంటూనే, మరోపక్క ఎరువుల ధరలను విపరీతంగా పెంచి రైతుల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు.ఒకేసారి బస్తా ఎరువుల ధరను రూ. 2,300 వరకు పెంచడం దారుణమన్నారు.ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు,అకాల వర్షాలతో పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతుంటే,ఎరువుల ధరలను పెంచి వారిపై అదనపు భారం మోపడం దుర్మార్గమన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీపీఐ (ఎంఎల్) జిల్లా నాయకులు ఆత్కూరి శ్రీకాంత్, బుర్ర స్వాతి, క్రాంతి,రవి,పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు,స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.