
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామంలో గుర్రతెలియని దుండగులు ఓ రైతుపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే..పంటపొలానికి వెళ్లిన రైతు రవీందర్ రెడ్డిపై దుండగులు అకస్మాత్తుగా దాడి చేశారు.కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి.రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిన బాధితుడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం అతడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించినట్లు సమాచారం.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దాడికి గల కారణాలపై ఆరా తీస్తూ, నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.