సంచలనం సృష్టించిన హత్య కేసు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రేపాక గ్రామంలో జరిగిన దారుణ హత్య ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.అక్రమ సంబంధం నేపథ్యంలో ఇద్దరు కుమారులు కలిసి తమ తండ్రిని గొడ్డలితో నరికి హత్య చేసిన ఈ ఘటన మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.పోలీసుల వివరాల ప్రకారం,రేపాక గ్రామానికి చెందిన కుర్రే చేరాలు (55) అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి తరచూ వివాదాలకు దారితీసింది.ఈ వ్యవహారంపై ఇప్పటికే కుటుంబంలో ఉద్రిక్తతలు నెలకొనగా,కుమారులు తండ్రి ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు.ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్లో ఉన్న కుర్రే రామ్,కుర్రే లక్ష్మణ్ గ్రామానికి చేరుకుని నేరానికి పాల్పడ్డారు.రాత్రి సుమారు 1:20 గంటల సమయంలో మహిళ నివాసానికి వెళ్లి తలుపులను బలవంతంగా తెరచి లోపలికి ప్రవేశించారు.అక్కడ తండ్రి చేరాలను మహిళతో కలిసి చూసిన వారు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.ఈ క్రమంలో కుర్రే రామ్ చేరాలను పట్టుకోగా,కుర్రే లక్ష్మణ్ తన వెంట తీసుకువచ్చిన గొడ్డలితో తలపై తీవ్రంగా దాడి చేశాడు.ఒక్కసారిగా జరిగిన ఈ దాడిలో చేరాలు తీవ్రంగా గాయపడ్డాడు.అడ్డుకోవడానికి ప్రయత్నించిన మహిళపై కూడా దాడి చేసి, ఆమె మెడలో ఉన్న బంగారు తాడును లాక్కొని అక్కడి నుండి నిందితులు పరారయ్యారు.స్థానికులు గమనించి వెంటనే గాయపడిన చేరాలను సమీప ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో మృతి చెందాడు.ఈ ఘటనపై మృతుని అన్న కుర్రే కుమార్ ఫిర్యాదు మేరకు రేగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సీఐ సిహెచ్. కరుణాకర్ రావు తెలిపారు.ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా,ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.గ్రామ ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ,నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు