
వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలి
హనుమకొండ జిల్లా, హసన్‌పర్తి, జూలై 2: హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న నాలుగు వరుసల జాతీయ రహదారి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై హసన్‌పర్తి పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కరీంనగర్ నుంచి వరంగల్‌కు వెళ్లే జాతీయ రహదారి-563 సమీపంలోని వ్యవసాయ భూమిలో సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు, 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు కలిగిన వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతుడు తెల్లటి బనియన్, నీలం రంగు ఫార్మల్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతదేహం ముఖభాగం, చేతులు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో గుర్తించడం కష్టంగా మారింది.
మృతదేహం సమీపంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్‌కు చెందిన నాసర్ ఖాన్ పేరిట ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, ఒక పాకెట్ బుక్, కొంత నగదు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే అవి మృతుడివేనా లేదా అన్న విషయాన్ని కూడా పోలీసులు నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు.
గ్రామ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎ. మహేందర్ అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి, మరణానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
ఈ మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతని బంధువులు ఎవరైనా ఉంటే హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌ను లేదా 8712685015 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.