ఎన్సీసీ శిక్షణతోనే క్రమశిక్షణ,విలువలతో కూడిన జీవితం
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పదో తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పది రోజుల సంయుక్త వార్షిక శిక్షణా శిబిరం (సి ఏ టీ సీ – 4) ఐదో రోజుకు చేరుకుంది.క్యాంపు కమాండెంట్ కల్నల్ ఎస్ఎస్ రాముదురై పర్యవేక్షణలో శుక్రవారం క్యాడెట్లకు రన్నింగ్,ఫైరింగ్,ఆయుధాల శిక్షణ, భారతదేశం-పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాలపై ప్రత్యేక ఉపన్యాసం,మ్యాప్ రీడింగ్ (నైసర్గిక స్వరూప పఠనం) అంశాలపై విస్తృత శిక్షణ ఇచ్చారు. ఈ శిబిరంలో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయ సామాజిక శాస్త్ర విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎం. స్వర్ణలత ముఖ్య అతిథిగా హాజరై ‘ఒత్తిడి నిర్వహణ – తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అనే అంశంపై క్యాడెట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు వ్యక్తిగత జీవితంతో పాటు చదువు,వృత్తిపరమైన విషయాలలో చిన్నపాటి ఒత్తిడి ఎదురైనా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కుప్పకూలడం వల్లే ఇలాంటి సమస్యలు పెరుగుతున్నాయన్నారు. ఒత్తిడి గురైనప్పుడు మానసిక నిపుణుల సలహాలు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలే తప్ప ప్రాణాలను పణంగా పెట్టవద్దని హితవు పలికారు. విలువలపై ఆధారపడిన జీవితాన్ని అలవర్చుకుని సమాజానికి,దేశానికి ఉపయోగపడేలా ఎదగాలని పిలుపునిచ్చారు. క్యాంపు కమాండింగ్ అధికారి కల్నల్ ఎస్ఎస్ రాముదురై మాట్లాడుతూ.. శిబిరంలో భాగంగా సాయంత్రం క్యాడెట్లకు క్రీడా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. భగత్ సింగ్ కంపెనీ, శివాజీ కంపెనీల మధ్య అలాగే రాణి రుద్రమదేవి, రాణా ప్రతాప్ కంపెనీల మధ్య హోరాహోరీగా వాలీబాల్ పోటీలు జరిగాయని వివరించారు. ఈ పోటీల విజేతలకు శిబిరం ముగింపు రోజున బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుందన్నారు. అలాగే ఈ రోజు నుండి క్యాడెట్లకు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా శిక్షణ ప్రారంభించినట్లు వెల్లడించారు. వరంగల్, ఖమ్మం జిల్లాల నుండి మొత్తం 613 మంది క్యాడెట్లు ఈ శిక్షణలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో క్యాంపు డిప్యూటీ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ రవి సునారే, గ్రూప్ అధికారులు, క్యాంపు కెప్టెన్ డాక్టర్ పి. సతీష్ కుమార్, కెప్టెన్ డాక్టర్ ఎం. సదానందం, సుబేదార్ మేజర్ జైరామ్ సింగ్, లెఫ్టినెంట్లు టి. గణేష్, బి. జీవన్, చీఫ్ ఆఫీసర్ రవీందర్,జూనియర్ కమిషన్డ్ అధికారులు సుతారి, రాజేంద్రన్, సోను, అనిల్ జాదవ్, అజం అలీ, మురళీకృష్ణ రెడ్డి, మారుతి మద్దం, రామ్నాథ్, గిత్తే, ప్రవీణ్ డాంగ్రే, కార్యాలయ సూపరింటెండెంట్ అరుణ, దత్తు, శిక్షణా విభాగం నుండి కుమారస్వామి, మహేష్, సతీష్, డాక్టర్ రాజీరు, నాగులు, భవాని, సజని, కాత్యాయని, విజయ్ కుమార్, దుర్గాప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.